హైదరాబాద్, ఆంధ్రప్రభ : బంగారు తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేస్తూ తెలంగాణ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేస్తున్న యూత్ ఐకాన్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడావేడుకలు నిర్వహించనున్నట్లు క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ప్రకటించారు. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా నిర్వహించే ఈవేడుకలను నిర్వహించేందుకు ముందుకు వస్తున్న క్రీడా సంఘాలను ఆయన ఆహ్వానించారు.
ఈనెల 24న రాష్ట్ర పురపాలిక, ఐటి, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహించనున్నక్రీడా వేడుకల ఏర్పాట్ల పై క్రీడాసంఘాలతో ఆంజనేయ గౌడ్ గురువారం ఎల్బీ స్టేడియంలోని కార్యాలయంలో సమావేశమయ్యారు. క్రీడా ప్రేమికుడైన యూత్ ఐకాన్ కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్రీడా సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు క్రీడా ప్రాధికారిక సంస్థ పూర్తిగా సహకరించనుందని చెప్పారు. ఈ వేడుకల్లో క్రీడా శాఖ ప్రధాన భూమిక పోషించనుందన్నారు.
క్రీడల శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ సహకారంతో సేక్లింగ్, రోలర్ స్కేటింగ్, రెజ్లింగ్ (మహిళలు) పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్మల్లారెడ్డి, దత్తాత్రేయ, తెలంగాణ అమెచ్యుర్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు అమ్ జాబీన్ ఓమర్, కె.నర్సింగ్ రావు, రోలర్ స్కేటింగ్, అసోసియేషన్ ప్రతినిధులు, కుషాల్ రాయ్ మహేందర్, దర్మేందర్ సింగ్ పాల్గొన్నారు.