Monday, November 25, 2024

శివసేన లోక్‌సభా పక్షంలోనూ చీలిక?.. ప్రత్యేక వర్గంగా ప్రకటించాలంటున్న 14మంది ఎంపీలు

శివసేనలో తిరుగుబాటు చేసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఏక్‌నాథ్‌ షిండేవర్గం లోక్‌సభాపక్షంలోనూ పట్టు సాధించే సూచనలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో శివసేనలో రెండువర్గాలుగా విడిపోయినట్టే లోక్‌సభ సభ్యుల్లోనూ విభజన తప్పేలా లేదు. లోక్‌సభలో శివసేనకు 19మంది ఎంపీలున్నారు. తాజాగా వారిలో 14మంది తమను షిండే సారథ్యంలోని శివసేన వర్గంగా గుర్తించాలని కోరుతున్నారు. ఈ విషయంపై త్వరలో స్పీకర్‌ ఓం బిర్లాకు వినతిపత్రం ఇవ్వనున్నారు. వీరంతా షిండేకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ-షిండే సారథ్యంలోని శివసేన వర్గాలు తెలిపారు. దీనిపై రెండు మూడు రోజుల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని ఆ వర్గాలు ప్రకటించాయి. కాగా వీరంతా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించనున్నారు. అరవింద్‌ సావంత్‌, వినాయక్‌ రౌత్‌, గజానన్‌ కృతికర్‌, సంజయ్‌ మండ్‌లికే సహా మరికొందరు ఎంపీలు ఉద్ధవ్‌ సారథ్యంలోను శివసేన నుంచి విడిపోయి ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలోని శివసేన పక్షాన ఉండాలనుకుంటున్నారని, రాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ లేనందువల్ల తామంతా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటిస్తామని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

ఉద్ధవ్‌పై తిరుగుబాడు చేసి మూడు పార్టీలతో ఏర్పాటైన మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. వెంటనే ధానే కార్పొరేషన్‌, నవీ ముంబై కార్పొరేషన్‌లను తన గుప్పిట్లోకి వచ్చేలా పావులు కదిపారు. మెజారిటీ కార్పొరేటర్లు షిండేవర్గంలోకి చేరారు. త్వరలో పూనే, ముంబై కార్పొరేషన్లు కూడా తమ చేతుల్లోకి వస్తాయని షిండేవర్గం ధీమాగా ఉంది. కాగా ఇప్పుడు లోక్‌సభలోని శివసేనపై కూడా పట్టు సాధించాలని షిండే వర్గం ప్రయత్నిస్తోంది. ఏక్‌నాథ్‌ షిండే తనయుడు శ్రీకాంత్‌ షిండే ప్రస్తుతం ఎంపీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన శివసేన టిక్కెట్‌పై గెలిచారు. కాగా లోక్‌సభలో తమ ఎంపీల్లోకూడా చీలీక తీసుకువచ్చేందుకు షిండే వర్గం ప్రయత్నిస్తుందని భావించిన శివసేన ముందుజాగ్రత్తగా స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాసింది. భావనా గవాలీని చీఫ్‌ విప్‌గా తొలగించామని, ఆమె స్థానంలో థానే ఎంపీ రాజన్‌ విచారెను నియమించామని సమాచారం ఇచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement