జన్నారం, (ఆంధ్రప్రభ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం రేంజ్ అడవుల్లోని బైసనుకుంట అటవీ ప్రాంతంలో ఆదివారం నిర్వహించిన బర్డ్ వాక్కు విశేష స్పందన లభించింది.
రాష్ట్రంలోని హైదరాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ తదితర జిల్లాలకు చెందిన పక్షి ప్రేమికులు తరలివచ్చారు. తమ తమ కెమెరాల్లో వివిధ రకాల పక్షులను చిత్రీకరించి ఆనందం వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పక్షి ప్రేమికులంతా శనివారం రాత్రి అడవిలో సఫారీకి వెళ్లి అడవిలో బస చేశారు.
మంచిర్యాల కవ్వాల టైగర్ రిజర్వ్ ఎఫ్ డీపీటీ శాంతారాం, డీఎఫ్ఓ శివ ఆశిష్ సింగ్ ఆదేశాల మేరకు తాళ్లపేట రేంజ్ అధికారి, స్థానిక ఇన్చార్జి వి.సుష్మారావు ఆధ్వర్యంలో పక్షి ప్రేమికులందరికీ భోజనంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు.
పక్షి ప్రేమికులు అడవుల్లో ఎంతో ఆనందంగా తిరుగుతూ కనబడ్డ పక్షులను తమ కెమెరాలల్లో బంధించారు. కట్టెలమంటతో ఏర్పాటు చేసుకున్న నెగడి పక్షి ప్రేమికులను ఆకట్టుకుంది. వారి వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ తిరుపతి, సెక్షన్ ఆఫీసర్లు నహీదా పర్వీన్,శివకుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు లాల్ భాయ్,ఎస్. శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.