న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ వీడి బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి బాటలో ఆయన కుమారుడు మర్రి పురురవ రెడ్డి శుక్రవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పురురవు రెడ్డి, పార్టీలో రాజకీయాలను వారసత్వంతో కాకుండా సమర్థత ఆధారంగా ముందుకెళ్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, కింది స్థాయి నుంచి ఎదగాలన్న ఉద్దేశంతో సనత్ నగర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలుపొందిన విషయాన్ని ఆయన తన రాజీనామా లేఖలో గుర్తుచేశారు.
అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష విధానాలతో పార్టీకి నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఇప్పట్లో పార్టీ బలపడే అవకాశం కనిపించడం లేదని, అందుకే కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. త్వరలో పురురవ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్టు తెలిసింది.