న్యూఢిల్లీ – పశ్చిమ బెంగాల్ లో రాజకీయ దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై లోక్‌సభ సెక్రటేరియట్, కేంద్ర హోంశాఖకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సందేశ్‌ఖాలీలో గత కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇటీవల బాధితులను కలిసేందుకు వెళ్తుండగా చోటుచేసుకున్న ఘర్షణల్లో బెంగాల్ భాజపా అధ్యక్షుడు, ఎంపీ సుకాంత మజుందార్ గాయపడ్డారు.
దీంతో ఆయన లోక్‌సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన లోక్‌సభ సెక్రటేరియట్ ప్రివిలేజెస్ కమిటీ.. పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. నేడు కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీనిపై బెంగాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై నేడు దర్యాప్తు చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్, భాజపా ఎంపీ సుకాంత, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. అప్పటిదాకా లోక్‌సభ కమిటీ దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.