ఉమ్మ డిరంగారెడ్డి, ప్రభన్యూస్‌బ్యూరో: రవాణాశాఖలో రికార్డులు బద్దలవుతున్నాయి.. ఒక జిల్లానుండి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చిన దాఖలాలు లేవు.. ఉమ్మడి రాష్ట్రంలో కూడా అంతమేర ఆదాయం సమకూరలేదు.. హైదరాబాద్ జిల్లా కూడా వెయ్యి కోట్ల ఆదాయం సమకూర్చిన పరిస్థితులు లేవు. వెయ్యి కోట్ల ఆదాయాన్ని సమకూర్చి రంగారెడ్డి జిల్లా రికార్డు సృష్టించింది.. కేవలం తొమ్మిది మాసాల వ్యవధిలో ఏకంగా రూ. 1150కోట్ల ఆదాయం సమకూర్చి రికార్డు సృష్టించింది.. ఇంకా మరో మూడు మాసాల గడువు ఉండటంతో మరింతమేర ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మిగతా జిల్లాలు రంగారెడ్డి జిల్లా దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.. ఎక్కువ శాతం ఆదాయం లైఫ్ ట్యాక్సుల నుండే సమకూరుతుండటం గమనార్హం…
ప్రభుత్వ ఆదాయానికి దండిగా ఆదాయం సమకూర్చుతున్న జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోంది…ఉమ్మడి రాష్ట్రంలో కూడా అధిక ఆదాయం ఇక్కడినుండే సమకూరేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా రంగారెడ్డి జిల్లా నుండి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూర్చుతూ శభాష్ అనిపించుకుంటున్నారు.. గతంలో ఎప్పుడూ కూడా ఒక జిల్లానుండి ఏడాదిలో వెయ్యి కోట్ల ఆదాయం సమకూరిన దాఖలాలు లేవు. హైదరాబాద్ మహానగరం నుండి కూడా రవాణాశాఖకు అంతమేర ఆదాయం వచ్చిన పరిస్థితులు ఎంతమాత్రం లేవు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా రికార్డు సృష్టించింది. ఈ ఏడాదిలో కేవలం తొమ్మిది మాసాల వ్యవధిలో ఏకంగా రూ. 1150కోట్ల ఆదాయం సమకూర్చిపెట్టింది. వాస్తవానికి 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రంగారెడ్డి జిల్లాకు రూ. 1206కోట్ల టార్గెట్ ఉండగా కేవలం తొమ్మిది మాసాల వ్యవధిలోనే ఏకంగా రూ. 1150కోట్ల మేర ఆదాయం సమకూర్చుకున్నారు.
ఏప్రిల్ నుండి డిసెంబర్ మాసాంతం వరకు వెయ్యికోట్లకు పైగానే ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలున్నాయి… వీటిలో కూడా ఆశించినమేర ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి….ఒక జిల్లానుండి వెయ్యి కోట్ల ఆదాయం సమకూరడం ఇదే తొలిసారి. వెయ్యి కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుని రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో రికార్డు సృష్టించింది. హైదరాబాద్ మహానగరానికి చుట్టూరా విస్తరించి ఉండటంతో ఉద్యోగాలు, వ్యాపారాలు, పిల్లల చదువుల కోసం వచ్చి నివాసాలు ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది… వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇలా రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ ఆదాయం పెరుగుతోంది.
ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూర్చిపెడుతున్న జిల్లాల్లో రంగారెడ్డి జిల్లా ముందు వరుసలో నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటినుండి ఎక్కువ ఆదాయం రంగారెడ్డి జిల్లానుండే సమకూరుతోంది. కరోనా సమయంలో కూడా ఆశించినమేర ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లా మూడవ స్థానంలో నిలుస్తోంది. ఈ జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 980కోట్లమేర టార్గెట్ ఉండగా తొమ్మిది మాసాల్లో రూ. 895.41కోట్లమేర ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. చిన్న జిల్లాగా పేరున్న వికారాబాద్ జిల్లాలో కూడా ఆశించినమేర ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 67.84కోట్లమేర టార్గెట్ ఉండగా ఇప్పటికే రూ. 58.17కోట్లమేర ఆదాయం వచ్చింది…
లైఫ్ దొరికింది..
రవాణాశాఖకు ఎక్కువ ఆదాయం లైఫ్ ట్యాక్సుల ద్వారా సమకూరుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ఆదాయం దీని ద్వారానే అందుతోంది. ఈసారి మిగతా ట్యాక్సులు కూడా పెరగడంతో ఈసారి టార్గెట్‌ను మించి ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌లో రవాణా శాఖ కార్యాలయాలున్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉప్పల్, పేట్‌బషీరాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో కార్యాలయాలుండగా వికారాబాద్ జిల్లాలో పరిగి,తాండూరు, వికారాబాద్ ప్రాంతాల్లో రవాణాశాఖ కార్యాలయాలున్నాయి. జంట జిల్లాలుగా కొనసాగుతున్న రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలనుండే ఏకంగా రూ. 1700కోట్లమేర ఆదాయం లైఫ్ ట్యాక్సుల ద్వారా సమకూరింది.
ఇందులో రంగారెడ్డి జిల్లానుండి రూ. 945కోట్లు సమకూరగా మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లానుండి రూ. 713.61కోట్లమేర ఆదాయం వచ్చింది. మిగతా వాటి ద్వారా కూడా ఆశించినమేర ఆదాయం వచ్చింది. రంగారెడ్డి జిల్లాలో క్వాటర్లీ ట్యాక్సుల ద్వారా రూ. 93.76కోట్లు, ఫీజుల ద్వారా రూ. 80.55కోట్లు, సర్వీస్ ట్యాక్సుల ద్వారా రూ. 15.11కోట్లు, డిటెక్షన్ నుండి రూ. 15.39కోట్లమేర ఆదాయం సమకూరింది… మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో క్వాటర్లీ ద్వారా రూ. 82.22కోట్లు, ఫీజుల ద్వారా రూ. 71.57కోట్లు, సర్వీస్ ట్యాక్సుల రూ. 14.87కోట్లు, డిటెక్షన్ ద్వారా రూ. 13.06కోట్ల మేర ఆదాయం వచ్చింది.
అందరి సహకారంతో ముందుకు….డీటీసీ ప్రవీణ్‌రావు…
జిల్లాలో అందరి సహకారంతో రవాణాశాఖ ఆదాయాన్ని పెంచుతున్నట్లు రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ ప్రవీణ్‌రావు తెలిపారు. వాహనాల కొనుగోలు ఆశించినమేర జరగడంతోపాటు ఇతర ట్యాక్సులు కూడా పెరిగాయని పేర్కొన్నారు. వెయ్యి కోట్లమేర ఆదాయం సాధించడం చాలా సంతోషంగా ఉందని రానున్న మూడు మాసాల్లో మరింతమేర ఆదాయం సమకూర్చుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.