ప్రకృతిని మనం కాపాడుకుంటేనే మనల్ని ప్రకృతి కాపాడుతుందని బలంగా నమ్ముతున్నానని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రకృతితో ఆడుకుంటే ఆ ప్రకృతి మానవాళికి ప్రమాదకరంగా మారుతుందని… అందుకే ప్రకృతిని ఎప్పుడూ కాపాడుకోవాలి అన్నారు.
ఇందులో భాగంగానే చెరువులను ఆక్రమించి, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ భవనాలు నిర్మించిన వారి భరతం పట్టేలా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా యాక్ట్ తీసుకొచ్చిందన్నారు. అయితే, హడ్రా ద్వారా చెరువులను పరిరక్షించే క్రమంలో… చెరువుల ఆక్రమణల కారణంగా దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్న ఎన్నో పక్షులు ఇప్పడు మళ్లీ కనిపిస్తున్నాయని, వాటి కిలకిలరావాలు వినిపిస్తున్నాయన్నారు. హైడ్రా ద్వార పునరుద్ధరించబడిన అమీన్‌పూర్ సరస్సులో కనిపించిన 12 సెంటీమీటర్ల రెడ్ బ్రెస్ట్ ఫ్లైక్యాచర్ పక్షి తాము సరైన మార్గంలో ఉన్నామని చెప్పేందుకు నిదర్శనమని, ఇది భగవంతుని ఆమోదం లాంటిదని సీఎం ట్వీట్ చేశారు.
కాగా, తాజాగా హైడ్రా తీసుకున్న చర్యలతో అమీన్‌పూర్ సరస్సులో అంతరించిపోతున్న జాతికి చెందిన ఓ పక్షి కనిపించింది. దీనిపేరు రెడ్ బ్రెస్టెడ్ ఫ్లైక్యాచర్. ఇది దాదాపుగా 12 సెంటీమీటర్ల పొడవుండే చిన్న పక్షి. శీతకాలంలో తెలంగాణకు వచ్చే ప్రత్యేక అతిథి ఈ పక్షి. ఈ పక్షులు ఐరోపా నుంచి దక్షిణాసియాకు వలస వస్తాయి. ముఖ్యంగా ఈ శీతాకాలంలో హైదరాబాద్ అమీన్‌పూర్ సరస్సు ఈ వలస పక్షులకు గమ్యస్థానంగా మారింది. చాలా ఏళ్ల తర్వాత ఈ చిన్న పక్షి కనిపించడంతో అక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.