ఐపీఎల్ తరహాలో సౌదీలోనూ టీ20 లీగ్ టోర్నమెంట్ నిర్వహణకు ఆ దేశ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రపంచంలోనే బిగ్గెస్ట్, రిచెస్ట్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ నిర్వహించేందుకు సౌదీ అరేబియా యోచిస్తోంది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ యాజమాన్యంతో సౌదీ ప్రతినిధులు చర్చలు సాగించినట్లు సమాచారం. త్వరలోనే దీనికి తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ మీడియా కథనాల ప్రకారం… ముస్లింల పవిత్ర స్థలం మక్కా నగరం కొలువుతీరిన సౌదీ అరేబియాలో మరో క్రీడా విప్లవం రాబోతోంది.
ఇప్పటికే ఫుట్‌బాల్, ఫార్ములా 1 గ్రాండ్ ప్రీతో క్రీడాకారులను ఆకర్షిస్తున్న ఆ దేశం మరో అడుగు ముందుకేసింది. సౌదీ అరేబియాలో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఇక్కడ ఐపీఎల్ మాదిరిగా భారీ టీ20 క్రికెట్ లీగ్‌ను నిర్వహించేందుకు సన్నాహకాలు చకచకా జరుగుతున్నాయి. ఏడాది క్రితం నుంచే దీనిపై సౌదీ ప్రభుత్వం కార్యాచరణ మొదలెట్టింది. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది నుంచి సౌదీలో టీ20 లీగ్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఫ్రాంచైజీల కోసం అన్వేషణ
సౌదీలో నిర్వహించబోయే ఐపీఎల్ తరహా టీ20 క్రికెట్ లీగ్‌లో ఫ్రాంచైజీల కోసం అన్వేషణ ప్రారంభించింది. క్రికెట్ లీగ్‌లో ఫ్రాంచైజీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని, ఆ మేరకు రాయితీలను ఇచ్చేందుకు కూడా సౌదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఫ్రాంచైజీలతోపాటు కోచ్‌లు, ఆటగాళ్లు, ఇతర సిబ్బందితో కూడా ఏడాది క్రితం నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. తమ దేశంలో క్రికెట్ ఆడితే భారీగా సొమ్ము ఇచ్చేందుకు కూడా రెడీ అవుతున్నారు. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. ఏ దేశంలో అయినా క్రికెట్ ఫ్రాంచైజీ లీగ్ నిర్వహించాలంటే ఐసీసీ అనుమతి తప్పనిసరి. ఐసీసీతో సౌదీ ప్రతినిధులు కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.
భారత క్రికెటర్లను ఆహ్వానించి..
ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్‌కు గుర్తింపు ఉంది. భారత క్రికెటర్లకు ఇండియాలోనే గాక ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లు ముందువరుసలో ఉంటారు. బీసీసీఐ అనుమతిస్తే… విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లు సౌదీలో నిర్వహించబోయే లీగ్‌లో ఆడే అవకాశముంది. అయితే ఈ విషయంలో బీసీసీఐ ఇంకా ఏ విషయం తేల్చలేదని సమాచారం.
ఇండియన్ ప్లేయర్లను బయటి లీగ్‌లలో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. కానీ బీసీసీఐతో సౌదీ ఇటీవల కాలంలో సత్సంబంధాలను కొనసాగిస్తోంది. ఐపీఎల్‌లో గతేడాది సౌదీ దిగ్గజ పెట్రోలియం సంస్థ ‘ఆరామ్ కో’ స్పాన్సర్‌గా వ్యవ#హరించింది. ఈ ఏడాది సౌదీ పర్యాటక శాఖ ఐపీఎల్ స్పాన్సర్షిప్‌లో భాగమైంది. తమ లీగ్‌లో భారత క్రికెటర్లను ఆడించే ఒప్పందంతోనే ఈ స్పాన్సర్ షిప్ బంధాలు సాగుతున్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.