Saturday, November 23, 2024

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు.. మూడన్నర కిలోల గంజాయి, సెల్‌ఫోన్‌ సీజ్‌

రామచంద్రాపురం, ప్రభన్యూస్‌ : ఇతర ప్రాంతాల నుంచి నిషేదిత మాదకద్రవ్యాలను తీసుకువచ్చి అమ్ముతున్న వ్యక్తిని మాదాపూర్‌ ఎస్‌ఓటీ (స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌) కొల్లూరు పోలీసులు పట్టుకున్నారు. కొల్లూరు ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌ ప్రాంతానికి చెందిన మానస్‌రంజన్‌ మహాలిక్‌ (28) 8 నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చి గచ్చిబౌళిలోని అంజయ్యనగర్‌ కాలనీలో నివాసముంటున్నాడు. లేబర్‌ కూలీగా తెల్లాపూర్‌, కొల్లూరు, గచ్చిబౌళి తదితర ప్రాంతాల్లో పని చేస్తున్నాడు.

బహుళ అంతస్తులు, విల్లాల నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కూలీల్లో కొంతమంది గంజాయికి అలవాటుపడటంతో పాటు దానిని దొంగచాటుగా కొనుగోలు చేస్తుండడంతో మానస్‌రంజన్‌ కొద్దిరోజుల క్రితం తన సొంత రాష్ట్రమైన ఒడిశాలోని జునియా గ్రామంలో ఎండిన గంజాయిని మూడున్నర కిలోలు కొనుగోలు చేశాడు. దానిని మూడు ప్యాకెట్లుగా ప్యాక్‌ చేసి ఒడిశా నుంచి హైదరాబాద్‌కు బస్సులో తీసుకువచ్చాడు.

- Advertisement -

బస్సు దిగిన తర్వాత మానస్‌ కొల్లూరులోని ఐఆర్‌ఏ ప్రాజెక్టు లేబర్‌ క్యాంప్‌ వద్ద అమ్ముతుండగా పోలీసులు పట్టుకొని అతని వద్ద నుంచి మూడున్నర కిలోల గంజాయి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా మానస్‌ రంజన్‌ ఒడిశాలో గంజాయిని మూడు వేల రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు చేసి 20వేల రూపాయల చొప్పున అమ్ముతున్నట్టు పేర్కొన్నారు.

మాదకద్రవ్యాలు అమ్మితే సమాచారమివ్వండి..

నిషేధిత మాదకద్రవ్యాలను ఎక్కడైనా ఎవరైనా అమ్ముతున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌ పేర్కొన్నారు. నిషేధిత మాదకద్రవ్యాలను రహస్యంగా క్రయవిక్రయాలు చేస్తున్న వారిని పట్టుకునేందుకు సామాన్య ప్రజలు సహకరించాలన్నారు. దీనివల్ల యువత చెడిపోతోందని, మాదకద్రవ్యాలకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

నిషేధిత మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించేందు కోసం అవేర్‌నెస్‌ క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, విషయం తెలిసిన వెంటనే 100కు డయల్‌ చేయాలని లేకపోతే సైబరాబాద్‌ ఎన్‌డిపిఎస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 7901105423కు ఫోన్‌ చేయవచ్చని లేనిపక్షంలో సైబరాబాద్‌ వాట్సాప్‌ ద్వారా 9490617444కు సమాచారం ఇవ్వవచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement