Saturday, November 23, 2024

అమెరికాలో కొత్త వైరస్‌.. హెచ్‌ఎంపీవీగా పేర్కొన్న వైద్య నిపుణులు

అగ్రరాజ్యం అమెరికాలో కొత్తరకం వైరస్‌ ప్రబలుతోంది. దీనిని హ్యూమన్‌ మెటా న్యుమో వైరస్‌ (హెచ్‌ఎంపీవీ)గా పేర్కొంటున్నారు. ఇదొక శ్వాసకోశ వైరస్‌. దీనికి ఇప్పటి వరకు నిర్దిష్ట వ్యాక్సిన్‌ అంటూ లేదు. అమెరికాలో దాదాపు అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. చాలా మందిలో వైరస్‌ సోకిందనే విషయాన్ని గుర్తించడం కూడా కష్టంగా ఉందని అక్కడి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీఎస్‌) గత వారం దేశవ్యాప్తంగా హెచ్‌ఎంపీవీ కేసుల పెరుగుదలను గుర్తించింది. మార్చిలో పరీక్షించిన నమూనాలలో సుమారు 11శాతం హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా తేలాయి. ఇది సాధారణ మహమ్మారి పూర్వ స్థాయిల కంటే 36శాతం అధికం. కొవిడ్‌ వైరస్‌ మాదిరిగానే ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో వేగంగా వ్యాపిస్తోంది.

ఎక్కువ మందిలో జలుబు లక్షణాలు కనిపిస్తుంటాయని, రెండు నుంచి ఐదు రోజుల వరకు ఈ వైరస్‌ లక్షణాలు ఉంటాయని సీడీఎస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరోగ్యవంతులు వారంతట వారే రికవరీ అవుతుండగా, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఇది ప్రభావాన్ని చూపుతున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. దగ్గు, జ్వరం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఈ వైరస్‌ సోకిన వారిలో ఉంటాయి. కరోనా వైరస్‌ మాదిరే ఇది కూడా ఒక మనిషి నుంచి మరో మనిషికి వ్యాప్తి చెందుతుంది.

- Advertisement -

వైరస్‌ లక్షణాలు

  • సీడీఎస్‌ ప్రకారం, హెచ్‌ఎంపీవీ వైరస్‌ నేరుగా ఎగువ శ్వాసకోశ నాళాలపై ప్రభావం చూపుతుంది. ఇది అన్ని వయసు వారికి సోకుతుంది. మరీముఖ్యంగా, చిన్న పిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది.
  • ఈ వైరస్‌ మొదటిసారి 2001లో గుర్తించబడింది. ఇది న్యుమోవిరిడే కుటుంబానికి చెందినది. ఇందులో శ్వాసకోశ సిన్సిటియల్‌ వైరస్‌ కూడా ఉంది.
  • వైరస్‌ సోకినవారిలో జలుపు వంటి లక్షణాలు మొదట కనిపిస్తాయి. ఐదు రోజుల వరకు లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత దానంతటదే తగ్గుతుంది.
  • కొవిడ్‌ మాదిరిగానే హెచ్‌ఎంపివి తరచుగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. ఇది చాలావరకు శ్వాసకోశ వైరస్‌ల మాదిరిగానే ఉంటుంది.
  • సరైన పరిశుభ్రత పాటించడమే ఈ వైరస్‌ నివారణకు కీలకం. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తరచుగా చేతులు కడుక్కోవడం, నోరు, ముక్కును కప్పుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
Advertisement

తాజా వార్తలు

Advertisement