ఆంధ్రప్రభ, హైదరాబాద్: కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన అనతికాలంలోనే ప్రగతి ప్రస్థానంలో దూసుకుపోతూ ఇప్పటికే పలు రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం మరో అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించింది. స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించడం ద్వారా రేపటి తరాల ప్రతిభను వెలికితీసి, ఆకాశమే హద్దుగా ఐటీ కార్పొరెట్లను తీర్చిదిద్దుతున్న తెలంగాణ రాష్ట్రం దేశ స్టార్టప్ చరిత్రలో సరికొత్త అధ్యయనాన్ని లిఖించింది. అంతరిక్షంలోకి ప్రయివేటు ఉప గ్రహాల ప్రయోగ చరిత్రలో మరో రికార్డును సృష్టించింది. ఐటి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువతను ప్రోత్సహించే దిశగా సీఎం కేసీఆర్ దార్శనికతతో, యువనేత, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టి హబ్‌లో సభ్యులైన యువత తమ ప్రతిభతో పలు రంగాల్లో అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఇప్పుడిప్పుడే వీటి ఫలాలు ఖండాంతరాలను దాటుతున్నాయి. ఇలా అంతరిక్ష ఉప గ్రహాల చరిత్రలో తెలంగాణ కీర్తి జాతీయస్థాయిలో మరో రైలురాయికి చేరింది. విజయవంతమైన ఉప గ్రహ ప్రయోగాలు తెలంగాణ ఘనకీర్తిని అంతరిక్షంలోకి మోసుకుపోయాయి.
హైదరాబాద్‌కు చెందిన శాటిలైట్లు….
తెలంగాణకు చెందిన ‘ధృవ’ స్పేస్ టెక్ ప్రయివేట్ సంస్థ ద్వారా శనివారం శ్రీహరికోట నుంచి ప్రయోగించబడిన రెండు నానో శాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్షలోకి ప్రవేశించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోకు చెందిన ” పిఎస్‌ఎల్‌వీసీ- 54 ” తో పాటుగా హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ధృవ’ స్టార్టప్ సంస్థ పంపిన ”తై బోల్ట్ 1, తై బోల్ట్ 2” అనే రెండు నానో ఉప గ్రహాల ప్రయోగం సక్సెస్ కావడం దేశ ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రయివేటు రంగం ద్వారా ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో మరో గొప్ప విజయమిదని అన్నారు. టిహబ్ సభ్య సంస్థ అయిన, స్కైరూట్’ స్టాటప్ కంపెనీ ఇటీవలే ప్రయోగించిన ” విక్రమ్-ఎస్ ” శాటిలైట్ విజయవంతం కావడం ద్వారా దేశ ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ కంపెనీ మొట్ట మొదటి సంస్థగా చరిత్రను లిఖించిందని సిీఎం కేసీఆర్ తెలిపారు.