Wednesday, November 20, 2024

చమురు దిగుమతుల్లో సరికొత్త రికార్డు.. 35 శాతం రష్యా నుంచే…

రష్యా నుంచి భారత్‌కు ముడి చమురు దిగుమతి ఫిబ్రవరి నెలలో మరింత పెరిగింది. మన దేశానికి ముడి చమురు సరఫరా చేస్తున్న దేశాల జాబితాలో వరుసగా ఐదు నెలలుగా రష్యా మొదటి స్థానంలో ఉంది. ఇంధన సరఫరాపై సమాచారాన్ని సేకరిస్తున్న వోర్టెక్సా, ఫిబ్రవరి 2023లో రికార్డు స్థాయిలో రోజుకు 16 లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకున్నట్లు వెల్లడించింది. ఇరాక్‌, సౌది అరేబియా దేశాలు కలిపి భారత్‌కు సరఫరా చేస్తున్న చమురు కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. మార్చి 31, 2022 నాటికి భారతదేశ వార్షిక ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2 శాతం మాత్రమే. ఫిబ్రవరి నాటికి రోజుకు 16 లక్షల బ్యారెళ్లకు చేరుకోవడం విశేషం. గతేడాది నవంబర్‌లో రోజుకు 9,09,403 బ్యారెళ్ల చమురు దిగుమతి అయ్యింది. అక్టోబర్‌లో తొలిసారిగా ఇరాక్‌, సౌది అరేబియాలను అధిగమించి రష్యా, భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా అవతరించింది. భారతదేశ చమురు దిగుమతుల్లో 35 శాతం రష్యా నుంచి వస్తుందని వోర్టెక్సా నివేదికలో పేర్కొంది.

- Advertisement -

నౌకల ద్వారా సరఫరా చేసే రష్యా చమురు ధరపై యూరోపియన్‌ యూనియన్‌ పరిమితి విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఒక్కో బ్యారెల్‌ ఇప్పుడు 60 డాలర్ల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్‌ దిగుమతులను పెంచిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు. మొత్తం చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీరుతోంది. వోర్టెక్సా డేటా ప్రకారం, ఫిబ్రవరిలో భారతదేశం ఇరాక్‌ నుంచి రోజుకు 9,39,921 బ్యారెల్స్‌. కాగా, సౌది అరేబియా నుంచి 6,47,813 బ్యారెల్స్‌, యూఏఈ నుంచి 4,04,570, అమెరికా నుంచి 2,48,430 బ్యారెల్స్‌ దిగుమతి చేసుకుంది. భారత్‌కు చమురు సరఫరా చేసే దేశాల జాబితాలో యూఏఈ, అమెరికాను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంది. సౌది అరేబియా నుంచి 16 శాతం, అమెరికా నుంచి 38 శాతం చమురు దిగుమతులు తగ్గాయి.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దానికి దిగకుండా పాశ్చాత్య దేశాలు ఆ దేశ చమురుపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో రష్యా తన చమురును సబ్సిడీ ధరకు అందించేందుకు ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశం భారత్‌ పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంటోంది. యుద్దం ప్రారంభానికి ముందు, భారతదేశం పశ్చిమాసియా దేశాల నుంచి 60 శాతం దిగుమతి చేసుకునేది. ఉత్తర అమెరికా దేశాల నుంచి మరో 14 శాతం, పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి 12 శాతం, లాటిన్‌ అమెరికా దేశాల నుంచి 5 శాతం, రష్యా నుంచి 2 శాతం మాత్రమే చమురు దిగుమతి అయ్యింది. రష్యా-ఉక్రెయిన్‌ వివాదం తర్వాత పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో చమురు ధర భారీగా పెరిగింది. యూరోపియన్‌ దేశాలు రష్యా చమురు కొనుగోలును నిలిపివేసి పశ్చిమ ఆఫ్రికా చమురుపై అధారపడటమే ఇందుకు కారణం. భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా, చమురు ఎక్కడ చౌకగా దొరికితే అక్కడ కొనుగోలు చేస్తామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌. జైశంకర్‌ గతేడాది డిసెంబర్‌ 7న రాజ్యసభలో స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement