విద్యార్థులకు సేవలందించేందుకు కొత్త విద్యా పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) మూడవ వార్షికోత్సవ వేడుకను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు జరిగిన ఎన్ఈపీ 2020 కార్యక్రమంలో దేశంలోని పలువురు విద్యావేత్తలు, విద్యా రంగ నిపుణులు, పరిశ్రమలు-విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్ లక్ష్యాలు, విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలను అందించడంపై చర్చించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి, ఏఐసీటీఈ ఛైర్మన్, ఏఐసీటీఈ చీఫ్ కోఆర్డినేటర్ బుద్దా చంద్రశేఖర్ ఇన్సోల్ పోర్టల్ సీఈఐ కిరణ్‌తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ఏడాది క్రితమే ఈ పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో సేవలందించబోతున్నట్టు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, డాటా స్టోరేజీ, నైపుణ్యాభివృద్ధి, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్‌కు ఇన్సోల్ పోర్టల్ బాగా ఉపయోగపడుతుందన్నారు. దీనిని విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఉద్యోగులు, ఉపాధి సంస్థలు చక్కగా ఉపయోగించుకోవచ్చని ఆయన చెప్పారు. కేవలం రూ. 1200లకే ప్రొఫెషనల్ కోర్సులు, ఫారిన్ లాంగ్వేజెస్, పోటీ పరీక్షల మెటీరియల్‌నూ ఈ పోర్టల్ ద్వారా పొందవచ్చని కిరణ్ వివరించారు.