హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని పల్లె దవాఖానాలు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. అన్ని ఆసుపత్రులు వైద్య, ఆరోగ్య శాఖ అమలు చేస్తున్న పథకాల లోగోలతో అందంగా కనిపిస్తున్నాయి. ప్రజల చెంతకే వైద్యాన్ని తీసుకు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 3206 పల్లె దవాఖానాలను ప్రారంభించింది. వీటిలో 1345 ప్రభుత్వ భవనాలు ఉండగా, మిగతావి అద్దె భవనాలలో కొనసాగుతున్నాయి. వీటన్నింటికి వైద్య, ఆరోగ్య శాఖ పసుపు పచ్చని రంగుతో కూడిన ఆరు రకాల లోగోలతో పెయింటింగ్ వేయించి ఆకర్శణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పెయింటింగ్ ప్ర్రక్రియ ఇప్పటికే మెదక్, నల్లగొండ జిల్లాలలో పూర్తి కాగా, రాష్ట్రంలోని పల్లె దవాఖానాలలో ఈ నెల చివరి నాటికి పూర్తవుతాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఉచితంగా వైద్యం అందజేయాలని భావిస్తున్నప్పటికీ ఇంకా కొందరు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.
ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, కంటి వెలుగు తదితర పథకాలపై అవగాహన కలిగించేందుకే గోడలపై పెయింటింగ్ వేయిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పల్లె దవాఖానాలలో 14 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందుతున్నాయి. కోవిడ్‌తో పాటు ఇన్‌ఫ్లుయెంజా వ్యాధుల నిర్ధారణకు సంబంధించి ర్యాపిడ్ కిట్లతో పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాలను కూడా అందిస్తున్నారు. వెంటనే రోగ నిర్ధారణ కూడా జరుగుతుండటంతో వైద్య చికిత్సలు కూడా అప్పుడే నిర్వహించే వీలు కలుగుతున్నది. అత్యవసర మందులతో పాటు జీవనశైలి, మానసిక ఆరోగ్యానికి సంబంధించి మందులను కూడా అవసరమైన రోగులకు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రతీ పల్లె దవాఖానాలోనూ ఎంబీబీఎస్ వైద్యుడిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ నియామక ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావొస్తుండగా, మిగతా చోట్ల ఆయుష్ వైద్యులను నియమిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలలొని సైతం సర్కార్ దవాఖానాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ఇదిలా ఉండగా, గ్రామీణ ప్రాంతాలలో సైతం ఇటీవలి కాలంలో జీవన శైలి వ్యాధులు విజృంభిస్తున్నాయి. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీటిని సకాలంలో గుర్తించకపోవడం వల్ల కిడ్నీ, గుండె జబ్బులు, పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను కూడా పల్లె దవాఖానాలలోనే వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ సమస్య పెద్దగా ఉంటే ముందుగా రిఫరల్, జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారు.