అమరావతి, ఆంధ్రప్రభ: పేద, మధ్య తరగతి వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో ఎక్కడైనా ఖాళీలుంటే… మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు వాటిని తక్షణమే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేన్సర్ రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించే చర్యల్లో భాగంగా విశాఖ కింగ్‌జార్జ్ ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి, కడప, ప్రభుత్వ ఆసుపత్రిలో కేన్సర్ సెంటర్లో పాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని పీఎంయూలో 353 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఒంగోలు, ఏలూరు, విజయవాడలలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలలో ప్రమోషన్ విధానం లేదా అవుట్ సోర్సింగ్ ద్వారా… 168 పోస్టులు భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య ఆరోగ్యరంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా 11 ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, వైద్య కళాశాలలో 99 పోస్టుల భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జీరో వెకెన్సీ పాలసీని వైద్య ఆరోగ్య శాఖలో సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడా కూడా సిబ్బంది లేకుండా ఖాళీలు ఉన్నాయన్న మాట వినపడకూడదన్నారు.
కొత్త ఆధ్యాయం
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ళలో వైద్య ఆరోగ్య రంగంలో కొత్త ఆధ్యాయానికి నాంది పలికింది. మున్నెన్నడూ లేని విధంగా వైద్య ఆరోగ్యశాఖలో దశలవారీగా 53,126 పోస్టులు భర్తీ చేశారు. వాకిన్ రిక్రూట్ మెంట్ విధానంలో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు నెలకు రూ.2 లక్షల పైన జీతం ఇవ్వడంతో పాటు, మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తుండటంతో మారుమూల ప్రాంతాలకు వెళ్ళేందుకు వైద్యులు సముఖత వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఆసుపత్రులను జాతీయ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసింది.
సీహెచ్‌సీలు నుంచి ఏరియా ఆసుపత్రులు, డిస్ట్రిక్ట్ర్ ఆసుపత్రులు మొదలుకుని టీచింగ్ ఆసుపత్రుల వరకు నాడు-నేడుతో జాతీయ స్ధాయి ప్రమాణాలతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. వీటికి అదనంగా 5 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏజెన్సీలో నిర్మిస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలను విస్తృతంగా పెంచారు. గతంలో 1,050 సేవలు అందుబాటులో ఉంటే ఇప్పుడు 3,256 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రతి పేషెంట్ ఈ సేవలను ఉచితంగా అందుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రోగికి డబ్బులు ఖర్చు కాకుండా, అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా అందుబాటులోకి వైద్య సేవలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు.
ముంగిట్లో వైద్యసేవలు
పల్లెల్లో వైద్య సేవలందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ల కార్యక్రమం ద్వారా పేదలకు ఆధునిక వైద్య సేవల్ని వారి ముంగిట్లోనే ఉచితంగా అందిస్తున్నారు. ప్రతి పిహెచ్ సిలో ఇద్దరు డాక్టర్లు, 104 వాహనం ద్వారా వైద్య సేవల్ని గ్రామాలలో వున్న డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లతో అనుసంధానం చేశారు. పిహెచ్ సిలో ఒక డాక్టర్ వైద్య సేవలందిస్తుంటే మరో డాక్టర్ తమకు కేటాయించిన గ్రామాన్ని సందర్శించి అక్కడి వైఎస్ఆర్ క్లినిక్ ద్వారా ప్రజలకు వైద్య సేవల్ని అందిస్తున్నారు.
దీంతో పాటు గ్రామంలోని పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడ కూడా వైద్య సేవలందిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకూ 2.60 కోట్ల మందికి వైద్య సేవలందాయి. పల్లె చెంతకు ఆధునిక వైద్యాన్ని తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో వున్న 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ లలో ప్రత్యేక శిక్షణ పొందిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా వైద్య సేవలందుతున్నాయి. వీరితో పాటు 24 గంటలూ అందుబాటులో వుండే విధంగా ఎఎన్ఎం, ఆశావర్కర్లను నియమించారు.
ఈ క్లినిక్ ల ద్వారా 12రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు 105 రకాల మందులు అందుబాటులో వుండే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీటితో పాటు టెలి మెడిసిన్ కార్యక్రమం ద్వారా స్పెషలిస్ట్ వైద్య సేవల్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. లైఫ్ సేవింగ్ పద్ధతులపై ఇప్పటికే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ నిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 542 పట్టణ ఆరోగ్య కేంద్రాల ద్వారా 172 రకాల మందులు, 60 రకాల వైద్య పరీక్షలను ప్రజలకు అందుబాటులో ఉంచింది.