న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సైన్యాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీకి కొత్త కార్యవర్గాన్ని రూపొందించేందుకు ఢిల్లీలో ఆ పార్టీ నేతలు సుదీర్ఘ కసరత్తు నిర్వహించారు. నిర్విరామంగా ఏకంగా 15 గంటల పాటు కమిటీ కూర్పుపై కసరత్తు సాగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగోర్తో పాటు ముగ్గురు సహ ఇంచార్జులు ఈ కసరత్తులో పాల్గొన్నట్టు తెలిసింది. టీపీసీసీ కార్యవర్గంలో ముఖ్యమైన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రటరీల నియామకాలతో పాటు ‘పొలిటికల్ అఫైర్స్ కమిటీ’ కూర్పుపై కసరత్తు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం కొత్త కమిటీ కూర్పులో ప్రతి విభాగంలో 50 శాతం యువనేతలకు (50 ఏళ్ల లోపువారికి) అవకాశం కల్పించినట్టు తెలిసింది. తద్వారా యువనేతలు, పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ ఏర్పడుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
మరోవైపు పార్టీని వీడుతున్న సీనియర్ల ప్రభావం పార్టీపై పడకుండా.. కొత్త తరానికి అవకాశాలు లభిస్తున్నాయన్న సంకేతాలు పంపొచ్చని అంచనా వేస్తోంది. అలాగని సీనియర్లను పూర్తిగా దూరం పెట్టకుండా, వారిలో అసంతృప్తిని చల్లార్చేందుకు కీలకమైన ‘పొలిటికల్ అఫైర్స్ కమిటీ’లో ఎక్కువ ప్రాధాన్యత కల్పించినట్టు తెలిసింది. క్యాంపెయిన్ కమిటీ సహా ఇతర అనుబంధ కమిటీలపై వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో కసరత్తు చేయనున్నట్టు ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. కొత్త కార్యవర్గం కూర్పుపై కసరత్తు అనంతరం రూపొందించిన నివేదికను మాణిక్యం టాగోర్ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు అందజేసినట్టు తెలిసింది. ఈ నివేదికలో సూచించిన నేతలకే పదవులు కట్టబెడతారా లేక మార్పులు చేర్పులు జరుగుతాయా అన్న విషయంపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడుగా ఎన్నికైన తరువాత టీపీసీసీ కార్యవర్గంలో కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్లు, కొందరు ఉపాధ్యక్షులను మాత్రమే నియమించారు. కార్యవర్గంలోని ఇతర పదవులు, అనుబంధ కమిటీలతో పాటు జిల్లా కమిటీల అధ్యక్షులు, కార్యవర్గంపై కూడా కసరత్తు చేపట్టలేదు. అయితే వీటన్నింటినీ ఒకే దఫాలో నియమించకుండా తొలుత పీసీసీ కార్యవర్గంలోని ఇతర పదవుల భర్తీ చేపట్టాలని, అనుబంధ కమిటీలో కీలకమైన పొలిటకల్ అఫైర్స్ కమిటీని పునర్వ్యవస్థీకరించాలని అధిష్టానం నిర్ణయించింది. అలాగే ఇప్పటికే పదవుల్లో ఉన్నవారిలో కొందరికి ఉద్వాసన పలికి ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం యువనేతలకు చోటు కల్పించవచ్చని తెలుస్తోంది.
మళ్లీ మొదలైన పంచాయితీ
కొత్త కార్యవర్గం పేరుతో రేవంత్ రెడ్డి పూర్తిగా తన మనుషులకే కీలక పదవులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తి రాగం మళ్లీ మొదలైంది. సీనియర్ నేతలను ఎవరినీ సంప్రదించకుండానే ఢిల్లీలో కూర్చుని కూర్పుపై కసరత్తు ఎలా చేస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ కసరత్తు టీపీసీసీలో కొత్త చిచ్చు రేపుతోంది. నిజానికి ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైన తర్వాత ఆయన అన్ని రాష్ట్రాల్లో పీసీసీ కార్యవర్గాల్లో మార్పులు-చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులను సైతం మార్చే కసరత్తు జరుగుతోంది. అయితే తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని ఆయన నిర్ణయించినట్టు తెలిసింది. అయితే కొత్త కార్యవర్గం కూర్పుపై కసరత్తు చేసే బాధ్యతను రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జికి అప్పగించి, ఆయనిచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి, మాణిక్యం టాగోర్తో పాటు ఏఐసిసి కారుదర్శులు (సహ ఇంచార్జులు) బోసురాజు, నదీమ్ జావేద్, రోహిత్ చౌదరిలు కలిసి సుదీర్ఘంగా కసరత్తు చేసి ప్రక్రియను పూర్తిచేసినట్టు తెలిసింది. కానీ ఈ కసరత్తులో తమను భాగం చేయకపోవడం, కనీసం సంప్రదించకపోవడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.
ద్దేశపూర్వకంగానే సీనియర్లను దూరం పేట్టే ప్రయత్నం జరుగుతోందని అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి తన అనుచరగణాన్ని కార్యవర్గంలో నింపుకుని, పూర్తిగా తన పెత్తనం చెలాయించే దిశగా అడుగులు వేస్తున్నారని కొందరు సీనియర్లు చెబుతున్నారు. ఈ ప్రయత్నాలను తాము అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కొందరు ఖర్గే దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే, మరికొందరు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు తంటాలు పడుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై ప్రియాంక గాంధీ సూచనలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఠాగూర్ రాష్ట్ర ఇంచార్జులతో సమీక్ష నిర్వహించారు. సీనియర్ల అసంతృప్తి, మర్రి శశిధర్ రెడ్డి వంటి నేతలు పార్టీ వీడి వెళ్లిపోవడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే పార్టీని వీడి వెళ్తున్నవారి విషయంలో ఆందోళన చెందాల్సిందేమీ లేదని, కొత్త తరం నేతలు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని అధిష్టానాన్ని సమాధానపరిచే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.