Wednesday, November 20, 2024

వేసవికి నెల రోజుల ముందే దేశమంతా ‘ఉక్కిరి బిక్కిరి’.. భయాందోళన కలిగిస్తున్న గరిష్ట ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : వాతావరణ శాఖకే అంతుచిక్కని విధంగా ఈ ఏడాది మండుటెండలు ప్రతిఒక్కరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్క తెలంగాణాలోనే కాదు.. దేశవ్యాప్తంగా వేసవికి నెల రోజుల ముందుగానే గరిష్ట్‌ ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్చి నెల ఆరంభం కాకముందే.. ఎండలు దంచి కొడుతున్నాయి. ఫిబ్రవరి నెల పూర్తి కాకముందే దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో.. ఆయా రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని కొంకణ్‌, గోవా, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్ల్రోనూ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోవడంతో.. జనాలు ఆందోళనకు గురవుతున్నారు. భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. అయితే, మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో వేడి గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని ఐఎండీ ఆదివారం హెచ్చరికలు జారీ చేసింది.

ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్నప్పటికీ.. త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. 4 నుంచి 9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ప్రతి ఏడాది ఈ సమయానికి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చితే, ప్రస్తుత ఉష్ణోగ్రతలు చాలా అధికమని ఐఎండీ చెబుతోంది. తాజా ఉష్ణోగ్రతలను అంచనా వేసి.. ఈ వేసవి మొత్తం ఎండలు అధికంగా ఉంటాయని చెప్పలేమని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు. భూ వాతావరణ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు ఇలా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వివరించారు. ఇక మైదాన ప్రాంతాల్లో 40 కంటే ఎక్కువ, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు వడగాలులు వీస్తున్నట్లు- ప్రకటిస్తారని పేర్కొన్నారు.

- Advertisement -

54 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత..

డిల్లీ-ఎన్‌సీఆర్‌లోని ప్రజలు ఎండ వేడికి ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఫిబ్రవరి నెలలోనే విపరీతమైన వేడితో అల్లాడిపోతున్నారు. దేశ రాజధానిలోని ప్రధాన వాతావరణ కేంద్రమైన సప్దnర్‌జంగ్‌ అబ్జర్వేటరీలో మంగళవారం గరిష్ట ఉష్ణోగ్రత 36.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ప్రస్తుత కాలంలో ఇది సాధారణం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ. 1969 నుంచి ఫిబ్రవరిలో మూడవ అత్యంత ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. పితంపురలోని ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌లో గరిష్టంగా 37.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువ. నజాఫ్‌గఢ్‌, రిడ్జ్‌ స్టేషన్‌లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34.6, 34.2 డిగ్రీల సెల్సియస్‌, సాధారణం కంటే తొమ్మిది నుంచి 10 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

ప్రాంతీయ అంచనా కేంద్రం అధిపతి కుల్దీప్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఢిల్లీలో ఫిబ్రవరి 26, 2006న 34.1 డిగ్రీల సెల్సియస్‌, ఫిబ్రవరి 17, 1993న 33.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1969-2023 కాలంలో ఢిల్లీలో ఇది మూడవ అత్యధిక ఉష్ణోగ్రతగా నమోదైంది. వెబ్‌సైట్‌లో అందుబాటు-లో ఉన్న డేటా ప్రకారం ఫిబ్రవరి 26, 2021న దేశ రాజధానిలో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఫిబ్రవరి నెలలో ఈ రకమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడం ఇదే మొదటిసారి. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అంచనాకు మించి పెరుగుతాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement