అమరావతి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాల తగ్గింపు చర్యలను వేగవంతం చేసేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సాయం అందించనుంది. ఇందుకోసం 1.5 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకారం తెలిపింది. పునరుత్పాదక ఇంధనాన్ని పెంచడం, గ్రీన్ హైడ్రోజన్‌ను అభివృద్ధి చేసేలా ఇంధన రంగంలో పెట్టు-బడుల కోసం ఈరుణాన్ని అందించనుంది. దీని ద్వారా తక్కువ-కార్బన్ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి అవకాశం ఏర్పడనుంది. 2030 నాటికి ప్రైవేట్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ రూపొందించనున్నారు.
ఈ రుణంలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌ను విజవంతంగా అమలు చేయడానికి వెసులుబాటు కలుగుతుందని భారతదేశానికి సంబంధించిన ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ అగస్టే టానో కౌమే అన్నారు. ఖర్చులను తగ్గించడం మరియు పవర్ గ్రిడ్ ఏకీకరణను మెరుగుపరచడం ద్వారా పునరుత్పాదక ఇంధన సరఫరాను పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. అదే సమయంలో భారతదేశం 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని 500 గిగావాట్ల (జీడబ్ల్యూ) కెపాసిటీకి చేరుకోవడంలో సహాయపడుతుందని వివరించారు.
ఏటా 50 గిగావాట్ల తయారీ కోసం బిడ్లు
2023-24 ఆర్ధిక సంవత్సరం నుండి 2027-28 ఆర్ధిక సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం 50 గిగా వాట్ల పునరుత్పాదక ఇంధనం కోసం బిడ్‌లను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది, ఇది 2026 నాటికి సంవత్సరానికి 40 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించనుంది. భారతదేశ తలసరి ఇంధన వినియోగం ప్రపంచ సగటులో మూడింట ఒక వంతు మాత్రమే. అయితే, ఆర్థిక వ్యవస్థ విస్తరణతో డిమాండ్ వేగంగా పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఇది 2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించాలనే జాతీయలక్ష్యానికి అనుగుణంగా శిలాజ ఆధారిత ఇంధన వనరులను దశలవారీగా తగ్గించాలని పిలుపునిచ్చింది.