హైదరాబాద్, ఆంధ్రప్రభ: మక్కా యాత్ర కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర హజ్ కమిటీకి దరఖాస్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నాయి. 2024 హజ్ యాత్రకు ఇప్పటి వరకు 5,335 దరఖాస్తులు ఆన్‌లైన్ పద్ధతిలో అందినట్లు తెలంగాణ హజ్ కమిటీ తెలిపింది. దరఖాస్తులు చేసుకోవడానికి ఈ నెల 20 వరకు చివరి తేదీ కాగా, 2024 జనవరి 15 వరకు కేంద్ర హజ్ కమిటీ గడువును పెంచడంతో మరింత అధిక సంఖ్యలో యాత్రికులు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కలిగింది.
దరఖాస్తుల ఆఖరు తేదీ వరకు దరఖాస్తుల సంఖ్య 12వేల నుంచి 15వేల వరకు పెరిగే అవకాశం ఉంటుందని కమిటీ భావిస్తోంది. గతేడాది 8,500ల వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో కేంద్ర హజ్ కమిటీ తెలంగాణకు కేటాయించిన 5,250 యాత్రికుల కోటాతో పవిత్ర హజ్‌కు వెళ్లే యాత్రికులను ఎంపిక చేసింది. తెలంగాణ నుంచి ఎంత మంది యాత్రికులు ఈ ఏడాది హజ్‌కు వెళ్తారన్నది ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింల జనాభా ఆధారంగా కేంద్ర హజ్ కమిటీ ఆయా రాష్ట్రాల కోటాను నిర్ణయింస్తుంది.
వచ్చే ఏడాది జనవరి 15న దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత జాతీయ స్థాయిలో అరబ్బు దేశాల సూచనల మేరకు కేంద్ర హజ్ కమిటీ ఆయా రాష్ట్రాలకు కోటాను నిర్ధారించి, అభ్యర్థులను కంప్యూటరైజ్డ్ లాటరీ విధానం ద్వారా ఎంపిక చేయనుంది. 70 ఏళ్లకు పైబడిన వారి ఎంపిక నేరుగా రిజర్వ్ కేటగిరీలో ఉంటుంది. వీరికి ఎలాంటి లాటరీ పద్ధతిలో ఎంపిక చేయకుండా దరఖాస్తు చేసిన వారందరిని నేరుగా ఎంపిక చేసి మక్కా యాత్రకు పంపిస్తారు. దీంతో పాటు 45 ఏళ్ల వయస్సు దాటిన షియా తెగకు చెందిన ఒంటరి మహిళలు, వితంతువులు, విడాకులు తీసుకున్న వారు మత పెద్దల నుంచి అనుమతిని తీసుకురావల్సి ఉంటుంది.
ఈ కేటగిరీలో 2021, 2022లలో నలుగురేసి మహిళలు హజ్ యాత్రకు వెళ్లగా, 2023లో 26 మంది వెళ్లారు. 2024లోను ఇలాంటి కేటగిరీకి చెందిన మహిళల్లో ఎంత మంది ఉన్నా, ఎంపిక చేయాల్సి ఉంటుందని హజ్ కమిటీ తెలిపింది. సున్నీ ముస్లిం వర్గాల్లో 70 ఏళ్లపై ఉన్న వారు మినహా, ప్రతి ఒక్కరూ లాటరీ పద్ధతిలోనే ఎంపిక కావల్సి ఉంటుందని కమిటీ వెల్లడించింది. 70 ఏళ్లకు పైబడిన వారు మొత్తం కోటాలో 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది.