న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికలకు ఒక నెల రోజులు ముందు మాత్రమే తాను రాజకీయాల గురించి మాట్లాడతానని, ఇప్పుడు మాట్లాడడని కాంగ్రెస్ ఎంపీ (భువనగిరి) కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం ఆయన ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం గం. 12.10 సమయంలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ప్రధానితో మూసీ నది ప్రక్షాళన, హైదరాబాద్ – విజయవాడ రహదారి విస్తరణ, యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ విస్తరణ, భువనగిరి కొండపైకి రోప్ వే తదితర అభివృద్ధి పనుల గురించి మాట్లాడినట్టు వెల్లడించారు. అలాగే ప్రధానితో మాట్లాడిన అన్ని విషయాల గురించి తాను చెప్పలేనని, కొంత గోప్యత కూడా పాటించాల్సి ఉంటుందని తెలిపారు.
యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం నేపథ్యంలో మోదీ ప్రధాని అయ్యాక బొగ్గు గనుల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకొచ్చారని, ఈ క్రమంలో జాయింట్ వెంచర్ క్లాజ్ ఒకటని తెలిపారు. అయితే నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో ఈ క్లాజ్‌ను పక్కనపెట్టి, కేసీఆర్ బంధువుకు టెండర్లను అప్పగించేందుకు సింగరేణి సంస్థ చేసిన ప్రయత్నాన్ని తాను బయటపెట్టానని, తన ఫిర్యాదు మేరకు ప్రధాన మంత్రి చర్యలు తీసుకుని కేటాయింపులు జరపకుండా ఆపారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఒక కాంగ్రెస్ ఎంపీగా రూ. 30 వేల కోట్ల విలువైన దేశ సంపదను తాను కాపాడానని అన్నారు. ప్రధానితో భేటీ సందర్భంగా ఈ విషయం మళ్లీ చర్చకొచ్చిందని అన్నారు.
మూసీ కోసం కేసీఆర్‌ను కూడా కలుస్తాను
శుక్రవారం ప్రధాన మంత్రిని కలవడం వెనుక ముఖ్య ఉద్దేశం మూసీ నది ప్రక్షాళనే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నదుల్లో మూసీ ఒకటని, ఈ విషయం తాను చెప్పడం లేదని, అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాలున్నాయని అన్నారు. ఆ కథనాల క్లిప్పింగులను ప్రధాని చూసి ఆశ్చర్యపోయారని అన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రంలో మూసీ నదిని శుభ్రం చేయలేకపోయారా అని మోదీ ప్రశ్నించారని వెంకటరెడ్డి చెప్పారు. తెలంగాణ బడ్జెట్, ఆర్థిక పరిస్థితి గురించి మీకు తెలియదా.. మీ పార్టీ నేతలే రోజూ విమర్శలు చేస్తుంటారు కదా అని తాను చెప్పానని కోమటిరెడ్డి అన్నారు. గతంలో అహ్మదాబాద్ నగరంలో ప్రవహించే సబర్మతి నది మూసీ తరహాలోనే దుర్గంధభరితంగా ఉండేదని, కానీ మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సబర్మతి రివర్ ఫ్రంట్ పేరుతో నదిని శుభ్రం చేయడమే కాదు, నదీ తీర ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారని వెంకటరెడ్డి కొనియాడారు. అదే తరహాలో హైదరాబాద్ మూసీ నదిని కూడా శుభ్రం చేయాల్సిన అవసరం ఉందని ప్రధానికి చెప్పారు.
హైదరాబాద్ నగరం నుంచి వెలువడే మురుగునీటితో పాటు ఫార్మా కంపెనీలు, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు ఆ నదిలో కలిసి నది నీటిని అత్యంత హానికారక భారలోహాలు, విష రసాయనాలతో నింపేశారని అన్నారు. ఆ నది నీటితో పండించిన పంటలు, కూరగాయల్నే హైదరాబాద్ సహా పరిసర ప్రాంత ప్రజలు వినియోగిస్తున్నారని, అక్కడి కొబ్బరిచెట్ల బోండాల్లో సైతం కాలుష్యం ఆనవాళ్లు కనిపిస్తున్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల్లో రూ. 3 వేల కోట్ల ప్యాకేజి ఇచ్చి ‘నమామి గంగ’ తరహాలో మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రధానిని కోరినట్టు వెల్లడించారు. మూసీ నది కోసం అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును కూడా కలుస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణ గురించి కూడా ప్రధాన మంత్రితో చర్చించినట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంట్రాక్ట్ సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది మార్చిలోనే రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలకు విస్తరించే పనులు మొదలుపెట్టాలని, కానీ వేర్వేరు కారణాలతో ఇప్పటి వరకు మొదలుపెట్టలేదని అన్నారు. నిత్యం రద్దీగా మారిన ఈ రహదారిపై తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో తక్షణమే రహదారి పనులను విస్తరించాలంటూ ఆదేశాలు జారీ చేయాలని ప్రధానిని కోరినట్టు చెప్పారు. దీంతో పాటు ఎంఎంటీఎస్ సర్వీసులను యాదగిరిగుట్ట వరకు విస్తరించాలని కూడా కోరినట్టు చెప్పారు. అలాగే భువనగిరి కోటకు రోప్ వే నిర్మించాలని, తద్వారా పర్యాటక ఆదాయం పెరుగుతుందని అన్నారు.
ఏ కమిటీల్లో లేను – స్వేచ్ఛగా ఉన్నాను
పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడేందుకు నిరాకరించారు. తాను ఎన్నికలకు ఒక నెల ముందు మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడతానని అన్నారు. అప్పటి వరకు తాను రాజకీయాలు మాట్లాడబోనని తెలిపారు. అయితే పార్టీలో అంతర్గత విషయాల గురించి ప్రశ్నించగా, తానిప్పుడు ఏ కమిటీలో లేనని, స్వేచ్ఛగా ఉన్నానని అన్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఏమైందని ప్రశ్నించగా.. పాత కమిటీలు అన్నీ రద్దయ్యాయని తెలిపారు.