Saturday, November 23, 2024

Big story | పురావస్తు పరిశోధనలకు కరువైన కేంద్ర సహకారం.. నిలిచిపోయిన కర్ణమామిడి తవ్వకాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్ర పురావస్తు శాఖ తెలంగాణ పై వేసిన శీత కన్నుతో వేలాది సంవత్సరాల సుధీర్ఘ చరిత్ర ఆనవాళ్లు కాలగర్భంలో కలిసి పోతున్నాయి. రాష్ట్ర పురావస్తు శాఖకు సంపూర్ణ అధికారాలు లేకపోవడంతో ప్రాచీన ప్రాంతాల్లో తవ్వకాలు నిర్వహించాలంటే కేంద్ర పురావస్తు శాఖ అనుమతితో పాటుగా నిధులు తప్పనిసరి. ఈ నేపథ్యంలో గోదావరి తీరప్రాంతంలోని కర్ణమామిడి లో జరిగిపిన తవ్వకాల్లో బహిర్గతమైన శాతవాహన రాజుల మట్టికోట, చారిత్రిక ఆనవాళ్లు తిరిగి కాలగర్భంలో కలిసి పోతున్నాయి.

- Advertisement -


హాజీపూర్‌ మండలంలోని కర్ణమామిడి ప్రాంతంలో జరిపిన ఈ తవ్వకాల్లో శాతవాహనుల కాలం నాటి ఆనవాళ్లు వెలుగు చూడటంతో పాటుగా క్రీ.పూ. 1వ శతాబ్దంలో భారతదేశంలో పర్యటింటిన గ్రీకు పర్యాటకుడు స్ట్రారో మెగస్తనీస్‌ తన ఇండికాలో తెలుగువారికి 30 కోటలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ 30 కోటల్లో కర్ణమామిడి ఒకటిగా సుప్రసిద్ధ చరిత్రకారుడు దివంగత వి.వి. కృష్ణ శాస్త్రీ భావించారు. ఇక్కడి నుంచి చూస్తే శాతవాహనుల తొలిరాజధాని కోట లింగాల అగుపిస్తోంది. అయితే ఈ తవ్వకాల ఆనందం అర్ధాంతరంగా నిలిచిపోయింది.

కేంద్ర పురావస్తు శాఖ పరిమితమైన అనుమతులు ఇవ్వడంతో పాటుగా నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్ర పురావస్తు శాఖ తవ్వకాలను ఆపివేయడంతో వెలుగు చూసిన అరుదైన సంపదకు రక్షణ కరువైంది. తవ్వకాలు జరిపిన ప్రాంతాలు తిరిగి వరదలతో కాలగర్భంలో కలిసి పోతున్నాయి. 1914 లో నిజాంప్రభుత్వం రాష్ట్ర పురావస్తు శాఖను ఏర్పాటు చేసినప్పటి నుంచి నేడు తెలంగాణ వారసత్వ శాఖ గా ఆవిర్భవించిన నాటికి రాష్ట్రంలో సుమారు 200 ప్రాచీన ప్రాంతాలను గుర్తించారు.

అయితే నాడు సమైఖ్యపాలకులు తెలంగాణ చరిత్రకు గ్రహణంలా పట్టడంతో పరిశోధనలు ముందుకు కదలేదు. నేడు కేంద్ర ప్రభ్రుత్వం సహకరించకపోవడంతో తెలంగాణలోని ప్రాచీన ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగకపోవడంతో తెలంగాణ చరిత్ర సంపద కాలక్రమేణ కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భువనగిరి, కోటిలింగాల, ఫణిగిరి, జోగులాంభ, గోల్కొండ, వేయిస్థంబాల గుడి, కాకతీయుల కోట, రామప్ప దేవాలయం తో పాటు ఆనేక ప్రాచీన సంపద కేంద్రం ఆధీనంలో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనలు చేయాలన్నా కేంద్రం అంగీకరించడంలేదు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి చరిత్రకారులు, మేధావులు, ప్రభుత్వం చేసిన నిరంత కృషికి కేవలం రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో విధిలేని పరిస్థితుల్లో కేంద్రప్రభుత్వం ఆలయ పరిసరాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందే కానీ మిగతా చారిత్రిక ప్రాంతాల అభివృద్ధికి నిధులు, అనుమతులు మంజూరు చేయకపోవడంతో తెలంగాణలో పురావస్తు పరిశోధన వేగం పుంజుకోవడంలేదు. మెగస్తానీస్‌ పేర్కొన్న 30 కోటల్లో తెలంగాణ లో విరాజిల్లిన అస్మక గణ తంత్ర రాజ్యంలో కొండాపూర్‌, వడ్లూరు, కోటిలింగాల, బోధన్‌(పౌదాన్యపురం) దూళికట్ట తదితర ప్రాచీన కోటల పట్టణాలు భూగర్భంలో కలిసిపోతున్నాయి.

కొండాపూర్‌ లో 105 ఎకరాల్లో శాతవాహన17వ రాజు హాలుడు మట్టి కోటను నిర్మించి రాజ్య మేలాడు. ఈ 105 ఎకరాల్లో కేవలం 10 ఎకరాల్లో కేంద్రం తవ్వకాలు జరిపి నిలిపి వేసింది. అలాగే మిగతా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొండాపూర్‌ లోనే గుణాఢ్యుడు పైచాచిక భాషలో బృహత్కథ రచించినట్లు ఇక్కడి తవ్వకాల్లో వెల్లడైంది. ఇంకా మిగిలిన 95 ఎకరాల్లో తవ్వకాలు జరిపితే ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతం అయ్యే అవకాశాలున్నాయి. కొంత మంది పురావస్తు పరిశోధకుల పరిశోధనల్లో కొండాపూర్‌ లోనే శాతవాహనుల ధనాగారం ఉన్నట్లు నిర్ధరణ అవడంతో పాటుగా 4వేల శాథవాహనుల నాణాలు లభించాయి.

గతం తెలిస్తేనే భవిష్యత్‌ ఉంటుంది పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్‌ చిన్నారెడ్డి గత చరిత్ర ఆనవాళ్ళపై మనదృష్టి సారిస్తేనే మనమెవరం, మనసంస్కృతి, ఆచారవ్యవహారాలు, పాలనా విధానాలు తెలుస్తాయని పూరావస్తు శాఖ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చిన్నారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలతో కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చి రాష్ట్రంలోపురావస్తు పరిశోధనలు వేగవంతం చేయాలని చెప్పారు. తెలంగాణలోని ప్రతి అణువులో చరిత్ర దాగి ఉందన్నారు. మోగస్తానీస్‌ ప్రస్తావించిన ప్రాచీన కోటలపై విస్తృతంగా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే పురావస్తు శాఖలో ఈ మేరకు నిపుణులైన పరిశోధకుల సంఖ్యను కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. క్రీస్తుపూర్వం నుంచి తెలంగాణలో చరిత్ర దాగి ఉందన్నారు. అనేక రాజవంశాలు తెలంగాణను వేదికగా చేసుకుని పరిపాలించాయని చెప్పారు. ఎంతో ఘనకీర్తి సాధించిన తెలంగాణలో చరిత్ర పరిశోధనలు మరింత వేగం పుంజుకోవాలని చెప్పారు. ఇటీవల కొంతమంది చరిత్ర కారులు తెలంగాణ చరిత్రను వెలికి తీయడం ఆభినందనీయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement