24 గంటల్లోనే హత్య కేసును ఛేదించిన పోలీసులు..
ఆంధ్రప్రభ బ్యూరో అదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని కుర్షిద్ నగర్ లో రోడ్డు పక్కన తీవ్రగాయాలతో గుర్తుపట్టకుండా మృతి చెంది పడి ఉన్న మహిళ కేసును పోలీసులు 24గంటల్లోనే చేదించారు. భార్యపై అక్రమ సంబంధం అనుమానంతోనే భర్త ఖలీల్ ఖాన్ దారుణంగా హతమార్చి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్ళాడు. మిస్టరీ హత్య కేసు వివరాలను డిఎస్పి జీవన్ రెడ్డి ఇవాళ మీడియా సమక్షంలో నిందితున్ని హాజరు పరిచి వెల్లడించారు.
ఖుర్షీద్ నగర్ కాలనీలో నివాసముండే ఆటో డ్రైవర్ ఖలీల్ ఖాన్ ఈనెల 12న అర్ధరాత్రి ఇంటికి రాగా.. ఇంటి పక్కన ఇద్దరు వ్యక్తులు పరిగెడుతూ కనిపించారు. ఇది గమనించిన ఖలీల్ ఖాన్ తన రెండో భార్య భారత (35)అలియాస్ సల్మాతో అక్రమ సంబంధం కొనసాగుతుందని అనుమానించి పిడిగుద్దులు గుద్దుతూ కర్ర చెక్కతో తలపై, మొఖంపై బలంగా కొట్టి దారుణంగా హతమార్చాడు. ఇంట్లో మృతదేహం ఉంటే తనను అరెస్టు చేస్తారని భావించిన ఖలీల్ ఖాన్ వెంటనే తన సొంత ఆటోలో మృతదేహాన్ని తీసుకొచ్చి మమతా జిన్నింగ్ ఫ్యాక్టరీ పక్కన అడ్డంగా ఉన్న లారీ వెనుక భాగంలో పడేసి వెళ్లాడు.
గుర్తుతెలియని మహిళ మృతి కేసును నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితున్ని అరెస్ట్ చేశారు. మృతురాలు భారత ఎస్టీ తెగకు చెందిన మహారాష్ట్ర మహిళ అని రెండో భార్య కింద ఆమె పేరును సల్మాగా మార్చుకున్నాడని డిఎస్పి జీవన్ రెడ్డి తెలిపారు. నిందితున్ని రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితున్ని అరెస్ట్ చేసిన టూ టౌన్ సీఐ అశోక్, ఎస్సై నాయక్, ఐడి పార్టీ సిబ్బంది రమేష్, నరేష్, క్రాంతి లను డిఎస్పి అభినందించారు. మీడియా సమావేశంలో వన్టౌన్ సిఐ ఉన్నారు.