Sunday, January 12, 2025

KNR | ఎమ్మెల్యే సంజయ్‌, కౌశిక్‌రెడ్డి తోపులాట

  • సంజయ్ కుమార్ ప్రసంగాన్ని అడ్డుకున్న కౌశిక్
  • కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం

కరీంనగర్, ఉమ్మడి జిల్లా బ్యూరో ఆంధ్రప్రభ : కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యాచరణ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది.

సమావేశంలో సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా నువ్వు ఏ పార్టీ నుండి గెలిచావు ఏ పార్టీలో చేరావు అంటూ కౌశిక్ రెడ్డి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మాట మాట పెరిగి తోపులాట జరిగింది. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే రగడ జరిగింది.

ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు…. సంజయ్ కుమార్ పైకి వెళ్తున్న కౌశిక్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయినా కూడా కౌశిక్ రెడ్డి వినకపోవడంతో పోలీసులు కౌశిక్ రెడ్డిని అడ్డుకొని బయటకు ఈడ్చుకొని వెళ్లారు. ఈ సందర్భంగా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఇది హేయమైన చర్య అని మండిపడ్డారు.

కౌశిక్ రెడ్డి విచక్షణ కోల్పోయి ప్రవర్తించారని, రాజకీయ దురుద్దేశంతోనే గొడవ పడ్డారన్నారు. పార్టీలకతీతంగా సమీక్ష సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరినీ ఆహ్వానించామని అన్నారు. సంజయ్ కుమార్ మాట్లాడేటప్పుడు కౌశిక్ రెడ్డి మైక్ లాక్కునే ప్రయత్నం చేసి దాడి చేసేందుకు ప్రయత్నించడం సిగ్గు చేటన్నారు.

డైవర్షన్ కోసమే కౌశిక్ రెడ్డి హంగామా సృష్టించారని ఆరోపించారు. పోలీసులు బయటికి తరలించిన అనంతరం కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని లేకపోతే ఎక్కడికి వెళ్లినా అడ్డుకుంటామని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement