నిజామాబాద్ సిటీ, (ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై.. సోమవారం ప్రమాణస్వీకారం చేసిన కె. సుజన, లక్ష్మి నారాయణలను నిజామాబాద్ న్యాయవాదుల బృందం కలిసింది. హైకోర్టు ప్రాంగణంలోని వారి చాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామ వాస్తవ్యుడు, హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు అయిన లక్ష్మినారాయణ జిల్లాకు గర్వకారణమని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, సంస్థ సీనియర్ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, గవర్నమెంట్ మాజీ ప్లీడర్ కిరణ్ కుమార్ గౌడ్, న్యాయవాదులు జగన్ మోహన్ గౌడ్, బిట్ల రవి అన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి కె.సుజన గతంలో నిజామాబాద్ జిల్లా ప్రధానన్యాయమూర్తిగా విధులు నిర్వహించారని ఇప్పుడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా ఎదగడం గొప్ప విషయమని వారు తెలిపారు. ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తులు భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. సామాన్యులుగా జీవిత గమనాన్ని ప్రారంభించి, ఉన్నతస్థితికి ఎదిగిన తీరు నేటి యువ న్యాయవాదుల తరానికి స్ఫూర్తి కావాలని అన్నారు.