Saturday, November 23, 2024

మునుగోడులో వేలకొద్దీ కొత్త ఓటర్లు.. అడ్డదారులు తొక్కుతున్న టీఆర్ఎస్అ, ఈసీకి బీజేపీ నేతల బృందం ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో టీఆర్‌ఎస్ అక్రమాలకు పాల్బడుతోందని బీజేపీ నేతలు ఆరోపించారు. అడ్డగోలుగా వేలాది మంది కొత్త ఓటర్లను నమోదు చేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. కేంద్రమంత్రి మురళీధరన్ నేతృత్వంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, ఎంపీ ప్రతాప్ సారంగి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావుతో కూడిన బృందం గురువారం న్యూఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసింది. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడిన తరుణ్ చుగ్ మునుగోడులో 25వేల కొత్త ఓటర్ల నమోదు జరిగిందని చెప్పుకొచ్చారు. సాధారణ పరిస్థితుల్లో కొత్త ఓటర్ల నమోదు ఈ నియోజకవర్గంలో గరిష్టంగా ఎప్పుడూ 2,000 దాటలేదన్న ఆయన, ఇంత పెద్ద మొత్తంలో కొత్త ఓటర్లు ఎక్కణ్నుంచి వచ్చారని ప్రశ్నించారు. 25 వేల కొత్త ఓటర్లంటే 40 వేల మందికి పైగా జనాభా ఈ నియోజకవర్గానికి వచ్చినట్టు భావించాలన్నారు. అంత పెద్ద మొత్తంలో ఈ నియోజకవర్గానికి వలసలు ఎలా సాధ్యమని తరుణ్ చుగ్ నిలదీశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా అధికారులు ఆ ప్రాంతంలోకి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలను ప్రభావితం చేసేలా టీఆర్‌ఎస్ చేస్తున్న ప్రయత్నాలను ఈసీకి వివరించామని చెప్పారు. ఓటమి భయంతో అక్రమాలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌పై చర్యలు చేపట్టాలని ఈసీని కోరామన్నారు. ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా అక్కడికి వెళ్తున్న అధికారులను బదిలీ చేయాలని కోరామని తరుణ్ చుగ్ వెల్లడించారు. నాలుగేళ్లుగా మునుగోడు నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. హైదరాబాద్ నుంచి ఏకంగా సచివాలయాన్నే మునుగోడుకు మార్చారని, అధికార యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూఅక్కడే మకాం వేశారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్, టీఆరెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. మునుగోడు అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఏమీ లేక, ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం సిండికేట్ సహా అనేక అవినీతి వ్యవహారాల్లో లోతుగా కూరుకుపోయిన టీఆర్‌ఎస్ నేతల అహంకార, అవినీతి, కుటుంబ పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని ఆయన జోస్యం చెప్పారు.

అనంతరం రామచందర్‌రావు మాట్లాడుతూ… కొత్తగా నమోదవుతున్న ఓటర్ల వ్యవహారంలో గోల్‌మాల్ జరిగిందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అధికారులు మునుగోడులోనే మకాం వేశారని విమర్శించారు. అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని దుయ్యబట్టారు. మూడేళ్లకు మించి అక్కడ పనిచేస్తున్న అధికారులను ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం బదిలీ చేయాలని కోరామని వెల్లడించారు. ప్రభుత్వ అధికారులను టీఆర్ఎస్ కార్యకర్తలుగా వినియోగించుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని రామచందర్‌రావు ధ్వజమెత్తారు. ఈ అంశాలన్నింటిపై విచారణ జరిపి చర్యలు చేపట్టాలని ఈసీని కోరామన్నారు. ఎన్నికల పర్యవేక్షకులను నియమించి, అక్కడ జరుగుతున్న అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశామని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement