Wednesday, November 20, 2024

సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవడంపై ఏపీ సర్కార్ అసంతృప్తి

హైదరాబాద్ మెడికల్ హబ్ కావడంతో కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీ నుంచి వేలాది మంది రోగులు తెలంగాణ వైపు వస్తున్నారు. అంబులెన్సుల్లో ఆక్సిజ‌న్ స‌హాయంతో వారంతా హైద‌రాబాద్ వ‌స్తుంటే సరిహద్దుల వద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పలువురి ప్రాణాలు అంబులెన్సుల్లో పోతున్నాయి. అయితే అంబులెన్సులను అడ్డుకోవాలని ఆదేశాలు ఎవ‌రు ఇచ్చారంటూ ఇటీవలే తెలంగాణ హైకోర్టు ప్ర‌భుత్వంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అయినా ప‌రిస్థితులు మార‌లేదు.

శుక్రవారం నాడు తెలంగాణ సరిహద్దుల వద్ద వంద‌లాది అంబులెన్సులు నిలిచిపోయాయి. ఈ-పాస్, బెడ్ ఉంద‌ని ఆసుప‌త్రి ఇచ్చే క‌న్ఫ‌ర్మేష‌న్ మెసెజ్ చూపాల‌ని పోలీసులు కోరుతున్నారు. వీటిపై అవ‌గాహ‌న లేక ప్రాణాపాయ స్థితిలో వ‌స్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనిపై ఇప్ప‌టికే ఏపీ, తెలంగాణ సీఎస్‌లు ఫోన్‌లో చ‌ర్చ‌లు జ‌రిపినా ప‌రిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వ తీరుపై ఏపీ స‌ర్కార్ కోర్టు మెట్లెక్కాల‌ని నిర్ణ‌యించింది. వైద్యం నిరాక‌రించ‌టం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధ‌మ‌ని, పైగా హైద‌రాబాద్ మ‌రో మూడేళ్లు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంటుంద‌ని, తమకు వైద్యం పొందే హ‌క్కు కూడా ఉంద‌ని ఏపీ సర్కార్ వాదించ‌నుంది. దీనిపై ఇప్పటికే న్యాయ సలహాలను ప్రభుత్వం తీసుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement