హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా పాట్లీకుహల్ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన అటవీ సంపద దగ్ధమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాలుతున్న అడవుల నుంచి దట్టమైన పొగలు, అగ్నిజ్వాలలు ఎగసి పడుతున్న దృశ్యాలు వీడియోలలో కనిపించాయి. హిమాచల్ అటవీశాఖ నివేదిక ప్రకారం,ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1,195 అగ్ని ప్రమాదాలు సంభవించాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో 263 అటవీ అగ్ని ప్రమాద సంఘటనలు నమోదయ్యాయి. బిలాస్‌పూర్, చంబా, నహాన్, రాంపూర్, సివ్లూ, సోలన్ జిల్లాల్లోని అడవులలో మంటలు చెలరేగాయి. ప్రతి జిల్లాలో పదుల సంఖ్యలో ప్రమాదాలు సంబవించాయి.
దాదాపు 2.8 కోట్ల విలువైన అటవీ సంపద దహనమైనట్లు ఈ నివేదిక పేర్కొంది. 13,275 హెక్టార్ల విస్తీర్ణం బుగ్గి అయిందని, ఇందులో 2079 హెక్టార్లు సహజ ప్రాంతం కాగా, 10,061 హెక్టార్లు ప్లాంటేషన్ ప్రాంతం, 1134 హెక్టార్లు అటవీ ప్రాంతం ఉన్నట్లు నిర్ధారించారు.