- వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
బిహార్‌లోని పూర్నియా జిల్లాలో చనిపోయిన బాలిక తాను బతికే ఉన్నానని వీడియో కాల్ చేయడం ఆశ్యర్యానికి గురిచేసింది. అక్బర్‌పూర్‌కు చెందిన అన్షు కుమారి అనే యువతి నెల రోజుల క్రితం హఠాత్తుగా అదృశ్యమైంది. బాలిక అదృశ్యమైన తర్వాత, ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికారు, అయినా ఆమె ఆచూకి దోరకలేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొన్ని రోజుల తరువాత, స్థానిక పోలీసులు కాలువలో గుర్తు తెలియని బాలికను కనుగొన్నారు. నీటిలో మునిగిపోవడంతో శరీరం గుర్తుపట్టిని విధంగా మారిపోయింది. దీంతో మృతదేహం ఎవరిదో గుర్తించడం సాధ్యం కాలేదు. అయితే ఈ విషయాన్ని పోలీసులు అన్షు కుటుంబసభ్యులకు తెలియజేయగా, బట్టల ఆధారంగా మృతదేహం తమ కూతురుదేనని అన్షు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం బాలిక చనిపోయిందని భావించి అంత్యక్రియలు చేశారు.
అయితే.. అంత్యక్రియలు జరిగిన కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా అన్షు నుండి ఆమె తండ్రి వినోద్ మండల్ కు వీడియో కాల్ వచ్చింది. తాను బతికే ఉన్నానని ఫోన్‌లో తండ్రికి చెప్పడంతో మొత్తం కుటుంబం షాక్ కి గురైంది. “నేను నా ప్రేమికుడిని వివాహం చేసుకోవడానికి ఇంటి నుండి పారిపోయాను… ప్రస్తుతం పూర్నియాలోని బన్మంఖి బ్లాక్‌లోని జాంకీ నగర్ ప్రాంతంలోని నా అత్తమామల ఇంట్లో ఉంటున్నాను” అని ఆమె తన తండ్రికి చెప్పింది.
దీంతో, వారు మరొక బాలిక మృతదేహాన్ని తమ కూతిరిగా భావించి దహనంసంస్కారాలు చేశారని గ్రహించారు. ఇదిలా ఉండగా, తాము తమ కుమార్తె అని దహనం చేసిన మృతదేహం ఎవరిది అనే పెద్ద ప్రశ్న ఇప్పుడు కుటుంబ సభ్యులకు.. పోలీసులకు ఉంది. దీంతో పోలీసులు కొత్త కోణంలో ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.