తాండూరు రూరల్, (ప్రభన్యూస్): పిడుగు పాటుతో ఓ మహిళ కూలీ మృతి చెందగా మరో యువతి గాయాల పాలయ్యింది. ఈ ఘటన గురువారం తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో చోటు చేసుకుంది. కరణ్ కోట్ పోలీసులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన హరిజన్ మహేష్ అనే యువకుడితో ఏడాది క్రితం దుద్యాలకు చెందిన మధులత (21)తో వివాహము జరిగింది.
కౌలు పొలంలో పత్తి గింజలు నాటుతుండగా.. సాయంత్రం వేళ ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమయ్యింది. అప్పుడే పొలం సమీపంలో పిడుగు పడింది. దీంతో మధులత, దస్తమ్మలు కుప్పకూలీ పడిపోయారు. గమనించిన కౌలు యజమాని నర్సయ్య గౌడ్, కూలీలను ఆటోలో చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే మధులత మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో యువతి దస్తమ్మ తీవ్రగాయాలై ప్రాణాలతో బయటపడింది. మధులత మరణంతో కుటుంభీకులు బోరున విలపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ శరణు బసప్ప, గ్రామ నాయకులు జిల్లా ఆసుపత్రికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు. మరోవైపు జరిగిన సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపారు.