హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తమ పిల్లలిద్దరూ అనారోగ్యం బారిన పడ్డారన్న ఆవేదనతో ఇరువురు పిల్లలతో సహా ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి, ఆయన సతీమణి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. కందిగూడ ప్రాంతానికి దంపతులు సతీశ్, వేద. వీరికి నిషికేత్(9), నిహాల్(5) సంవత్సరాల వయసు గల పిల్లలున్నారు. అయితే పిల్లల అనారోగ్యం బారిన పడ్డారన్న ఆవేదనతో ఆ దంపతులిద్దరూ ఇంట్లో సెనైడ్ మింగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. పిల్లలు అనారోగ్యం బారిన పడినా వారికి పూర్తిస్థాయిలో వైద్యం అందించలేకపోయామన్న ఆవేదనను భరించలేక ఆ ఇద్దరు దంపతులు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుషాయిగూడ పోలీసులు.. అక్కడి వెళ్లి చూడగా నలుగురూ విగత జీవులుగా పడిఉన్నారు.
సతీష్, వేద సెనైడ్ మింగి పిల్లలకు కూడా తినిపించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ సాప్ట్‌వేర్ ఉద్యోగిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… తదుపరి విచారణ చేపట్టారు. ఈ కేసుపై వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో కందిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్నమొన్నటి వరకు ఆనందంగా గడిపిన కుటుంబం ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను ఎంతో కలిచివేసింది. ఇక ఆత్మహత్య ఘటన విషయం తెలుసుకున్న సతీష్, వేద కుటుంబాలకు చెందిన బంధువులు కందిగూడకు చేరుకున్నారు. నలుగురూ విగత జీవులుగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు. ఎందుకు చనిపోయారో తమకు తెలియదని పేర్కొన్నారు.
ఈ ఘటనతో సతీష్, వేద కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఇంటి పెద్దతో సహా ఇలా చేయడంపై స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే… పరిష్కార మార్గం వెతకాలి కానీ.. ఇలా పిల్లలతో కలిసి చనిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పిల్లల ఆరోగ్యం బాగలేదు కాబట్టి… తాము బతికి దండగ అని భావించి చనిపోయినట్లు- వాపోతున్నారు. పిల్లలు లేని జీవితం ఎందుకు అనుకున్నారని.. వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా… ఇలా కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడటం.. అక్కడి వాసులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.