Friday, October 18, 2024

Delhi: విద్యుత్ కోత‌లు లేని దేశం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప‌దేళ్ల‌లోనే మోదీ ఘ‌న‌త‌
బొగ్గు కొర‌త లేకుండా చూడ‌ట‌మే కార‌ణం
బొగ్గు, గ‌నుల శాఖ మంత్రిగా కిష‌న్ రెడ్డి బాధ్య‌త‌లు
ఇచ్చిన శాఖ‌ను స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హిస్తాన‌న్న మంత్రి

అన్ని రాష్ట్రాల్లో గత పదేండ్లలో ప్రధాని మోడీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా న్యూఢిల్లీలో ఆయ‌న ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త‌న‌కు రెండు శాఖల బాధ్యతలు ఇచ్చారన్నారు. ఈ మేరకు ఇవాళ బొగ్గు, మైనింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నానని తెలిపారు. ఇప్పటి వరకు ప్రహ్లాద్ జోషి, అంతకు ముందు పీయూష్ గోయల్ ప్రధాని మోడీ ఆశీర్వాదంతో ఈ శాఖలో పనిచేశారన్నారు. ప్రజల జీవితాల్లో విద్యుత్ రంగం కీలకంగా ఉన్నదన్నారు.

పదేండ్ల క్రితం దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేదన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామికవేత్తలు సమ్మె చేసిన ఘటనలు మనం చూశామన్నారు. కరెంట్, నీళ్ల కొరత ఉండేది. పంటలు ఎండిపోయేవి. అన్ని రాష్ట్రాల్లో గత పదేండ్లలో మోదీ విద్యుత్ కొరతకు చెక్ పెట్టారన్నారు. ఆయ‌న నాయకత్వంలో గత పదేండ్ల నుంచి వ్యవసాయానికి, పరిశ్రమలకు, గృహాలకు సరిపోను కరేంట్ వస్తున్నది. దానికి ప్రధానమైన కారణం బొగ్గు అన్నారు.

థ‌ర్మ‌ల్ కేంద్రాల ద్వారానే ఈరోజు ఎక్కువ శాతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి మనం కొంత దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మన అవసరాలకు సరిపోయేలా బొగ్గు ఉత్పత్తిని పెంచుతామన్నారు. దేశంలో ఉన్న ఖనిజాలను బయటకు తీయడం, ఉపాధి అవకాశాలను పెంచడం, భారత్ ఖనిజాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా కృషి చేస్తామన్నారు.

- Advertisement -

దేశ ప్రజల ఆకాంక్షల మేరకు, మోడీ సంకల్ప్ పత్రంలో పేర్కొన్నట్టుగా ఈ ఐదేండ్లు పూర్తి స్థాయిలో తనకు అప్పగించిన శాఖల బాధ్యతలను నెరవేరుస్తానని తెలిపారు. శక్తివంతమైన భారత్ ను రూపొందించడంలో బొగ్గు, మైనింగ్ శాఖల పాత్ర కీలకం అన్నారు. దాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ శాఖల్లో చాలా సీనియర్, ఉత్తమ అధికారులు ఉన్నారన్నారు. వారందరితో కలిసి టీమ్ వర్క్ తో పనిచేసి భారత్ ను అగ్రపథంలో నడిపించేందుకు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement