Friday, November 22, 2024

Big story | పత్తి రైతు కన్నీటి గాథ.. ప్రతికూల వాతావరణంతో పడిపోయిన దిగుబడులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : పండుగ పూట పత్తి రైతుల కన్నీటి గాథ ప్రతి ఒక్కరినీ కలవరపెడుతోంది. ప్రతికూల వాతావరణంతో అమాంతం పడిపోయిన దిగుబడులు తీవ్రమైన నష్టాన్ని, ఊహించని కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. అదే స్థాయిలో కలిసిరాని కనీస మద్దతు ధరలు అన్న్‌దాతలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలే ఎన్నికల సమయం కావడంతో ఇటు రాష్ట్రస్థాయి, అటు జిల్లా స్థాయి అధికార యంత్రాంగమంతా ఈసీ మార్గదర్శకాల మేరకు పనిచేయాల్సి వస్తోంది.

మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం శాపంగా మారుతోంది. అదును చూసి దెబ్బ కొట్టేందుకు కాచుకు చూర్చున్న ప్రయివేటు మిల్లర్లతో రైతులకు మరోకోణంలో ముప్పు పొంచి ఉంది. ప్రతియేటా పెరుగుతూ వస్తున్న మధ్యవర్తుల ప్రమేయం ఎన్నికల నేపథ్యంలో మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చుట్టుముట్టిన సమస్యలతో అన్నదాత సతమతమవుతున్నా.. పట్టించుకునేందుకు ఆపద్ధర్మంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం, అవకాశం లేకుండా పోతోంది.

- Advertisement -

పత్తి కొనుగోళ్ళ అంశం కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టుకుని ఉండడంతో నష్టాల్లో అగాదం పెరుగుతోంది. సిరుల పంట చేతికొచ్చి.. లాభాలు మూటగట్టుకొస్తుందని సంబురపడ్డ పత్తి రైతుకు దు:ఖమే మిగులుతోంది. పెట్టుబడులైనా దక్కకపోతాయా అని ఎదురుచూసినా.. దూది పూలు మాత్రం సాగుదారుకు పుట్టెడు కష్టాన్నే మిగులిస్తున్నాయి. పండించిన పంటకు మార్కెట్లో ఏ మేరకు మద్దతు లభిస్తుందోనని అన్నదాత కలవరపాటుకు గురవుతున్నారు.

గతేడాది పత్తి పంట లాభాలు నిరాశాజనకంగానే మిగిలాయి. ఈసారి పత్తి పంట ఇప్పుడిప్పుడే ఇంటికి చేరుతోంది. కొనుగోళ్ళకు సమయం ముంచుకొస్తున్నా.. అధికార యంత్రాంగం మాత్రం ఆస్థాయిలో స్పందించడం లేదు. అసలే ఎన్నికల సమయంలో నిమగ్నమైన ఉన్నతాధికారులను, జిల్లా స్థాయి అధికారులను కలిసి విజ్ఞప్తి చేయడం గగనంగా మారుతోంది. కొనుగోళ్లకు ఇప్పటికే సమయం మించిపోవడంతో ఉన్నతాధికారులు సైతం దృష్టి సారించారు. పత్తి కొనుగోళ్ళకు పేరుగాంచిన ఖమ్మం, ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో సౌకర్యాలను స్థానిక కలెక్టర్లు పరిశీలించారు.

శనివారం రైతులు, వ్యాపారులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కొనుగోళ్లలో అనుసరించాల్సిన ప్రక్రియపై చర్చించారు. కానీ మద్దతు ధరల విషయంలో తామేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. అధిక వర్షాలతో సాగు తొలినాళ్లలోనే నష్టపోయిన రైతులు, ఇప్పుడు మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడంపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క పత్తి వ్యాపారులు, లారీ ఓనర్స్‌ మధ్య నెలకొన్న వివాదాన్ని సైతం ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. అసలే దిగుబడులు సగానికి సగం పడిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న రైతును.. గణనీయంగా పడిపోయిన పత్తి ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి.

ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకుని పత్తి సాగు చేసినా.. కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పండుగ పూట అన్నదాత కళ్లల్లో కన్నీటిసుడులే కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో 1,79,287 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,99,720 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. అయితే ఉమ్మడి జిల్లాలో పత్తి రైతులకు ఈ వానాకాలం సీజన్‌ కలిసి రాలేదనే చెప్పాలి. సీజన్‌ ఆరంభం నుంచీ అన్నదాతకు కాలం పరీక్ష పెడుతూనే ఉంది. తొలకరి పులకరింతతో జూన్‌ నెలలోనే రైతులు పత్తి విత్తనాలు నాటారు.

ఆ తర్వాత కొద్ది రోజులకే వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు రెండు మూడు సార్లు విత్తనాలు నాటాల్సి వచ్చింది. దీంతో సాగుదారుపై అదనపు భారం తప్పలేదు. ఇంత చేసినా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు పడకపోవడంతో పాటు.. పత్తికి తెగుళ్లు సోకడంతో పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడింది. ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేకపోవడంతో అన్నదాతలు అదనపు పెట్టు-బడులు పెట్టారు. ఎండల తీవ్రత పెరగడంతో పత్తి తోటలు వడబడి పోతున్నాయి. వాతావరణ పరిస్థితులు, పత్తిలో ఎదుగుదల లోపించడం పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

నానా కష్టాలు పడి ఎంతో కొంత పంట చేతికొచ్చినా.. భారీగా దిగుబడులు పడిపోవడంతో రైతులు కుంగిపోతున్నారు. ఉభయ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పత్తి తీసి విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొస్తున్న సాగుదారులు నష్టాలే మూటగట్టు-కుంటు-న్నారు. సాధారణంగా వర్షాలు కురిసి, ఎదుగుదల బాగుంటే మూడు విడతలుగా తీస్తే పత్తి ఆశించిన స్థాయిలోనే వస్తుంది. ఎర్రనేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు, నల్లరేగడి భూముల్లో 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది.

కానీ ప్రస్తుతం ఎర్రనేలల్లో 5 క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 7 క్వింటాళ్లు కూడా పత్తి దిగుబడులు రావడం లేదు. ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి రావడమే గగనంగా మారిందని రైతులు వాపోతున్నారు. చేతికొచ్చిన కొద్దిపాటి పత్తిని విక్రయించుకునేందుకు మార్కెట్‌ వస్తున్నా అక్కడా నష్టాలు తప్పడం లేదు. పత్తి ధరలు పాతాళానికి పడిపోయాయి. గతేడాది క్వింటా పత్తి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు పలికింది. కానీ ఈసారి రూ.7 వేలు దాటడం లేదు. పత్తి రంగు మారిందని, నాణ్యత లేదంటూ రైతుల వద్ద రూ.6 వేలకే కొనుగోలు చేస్తున్నారు.

ఫలితంగా రైతులు క్వింటా పత్తికి ఏకంగా రూ.4వేల నుంచి రూ.6 వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగులో నష్టాలు మిగలడంతో.. ఈ సారి పండుగ పూట కష్టాలు తప్పేలా లేవని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి, గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అంటే పత్తి పంటకు ప్రధాన కేంద్రం. ఇందులో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పత్తి మార్కెట్‌ ఆసియాలోనే మంచి పేరు ప్రఖ్యాతులుగాంచింది.

ఇక్కడ పండించే పత్తికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంటుంది. ఈ ఏడాది ఆదిలాబాద్‌ జిల్లాలో 4.12లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. సుమారు 28లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. పత్తి కొనుగోళ్లకు సమయం వచ్చింది. కిందటేడాది అక్టోబర్‌ 14వ తేదీనే ప్రారంభించగా.. ఈ ఏడాది కాస్త ఆలస్యమవుతోంది. అయితే, ప్రతి ఏటా గిట్టుబాటు ధర, తేమ శాతం నిబంధనపైనే ఘర్షణ నెలకొంటోంది. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.7020గా నిర్ణయించింది. కిందటేడాది ప్రభుత్వ మద్దతు ధర రూ.6380గా ఉండగా.. ఈ ఏడాది స్వల్పంగా పెరిగింది.

కానీ పెరిగిన ధరకు ఎలాంటి శాస్త్రీయత లేకుండా పోయిందని అన్నదాతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పంట కోసం పెట్టిన పెట్టుబడి ఖర్చులో 50శాతం కలిపి ధర నిర్ణయించాలని స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు ఉండగా.. ప్రభుత్వం ఆ దిశగా దృష్టిసారించలేదు. రూ.640 మాత్రమే ధర పెంచి కేంద్రం చేతులు దులిపేసుకుంది. ప్రస్తుతం విత్తనాలు, ఎరువులు, రసాయనిక మందుల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరానికి పెట్టుబడి ఖర్చు భారీగా అవుతోంది. కేంద్ర ప్రభుత్వం వీటిని పరిగణనలోకి తీసుకోకుండా ధర నిర్ణయించడంతో అన్నదాతల్లో ఆవేదన చెందుతున్నారు.

ప్రతి ఏటా గిట్టుబాటు ధరతో పాటు తేమ నిబంధనపైనే పేచీ నెలకొంటోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే వ్యాపారులు కొంత మాత్రమే అధికంగా చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. మరోపక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ 8శాతం కంటే అధికంగా ఉండకూడదు. అలా అయితేనే ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ కొనుగోలుకు ముందుకొస్తుంది. అంతకంటే ఎక్కువ తేమ చూపిస్తే.. గత్యంతరం లేక రైతులు ప్రయివేటు వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. అందువల్ల ప్రభుత్వం తేమపై కొంత మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు.

అదేవిధంగా కొనుగోళ్ల ప్రారంభం నుంచి చివరి వరకు సీసీఐ రంగంలో ఉండాలని రైతులు కోరుతున్నారు. మరోపక్క ప్రతిసారీ ఆదిలాబాద్లో లారీ ఓనర్లు, వ్యాపారులకు మధ్య వివాదం ఏర్పడుతోంది. స్థానిక లారీల ద్వారా పత్తి ఘటాన్లను సరఫరా చేయాలని లారీ ఓనర్లు పట్టు-బడుతుండగా.. వీరు నిర్ణయించిన ధర తమకు గిట్టు-బాటు- కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఓపెన్‌ మార్కెట్‌ ఉండాలని కోరుతున్నారు. ఈ వివాదాన్ని ఉన్నతాధికారులు పరిష్కరించాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement