Monday, November 18, 2024

Story | విద్యే వారికి వ్యాపారం.. కార్పొరేట్ పాఠశాలల‌ కక్కుర్తి

ప్రభన్యూస్‌ ప్రతినిధి, భూపాలపల్లి: విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన పాఠశాలలు ధనార్జనే ధ్యేయంగా విద్యను వ్యాపారం చేస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలు కక్కుర్తిపడి లేత మనసులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి కార్పొరేట్ యాజమాన్యాలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. దీంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. విద్యాహక్కు చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంతో జయశంకర్‌ జిల్లాలో కార్పోరేట్‌ యాజమాన్యాలు ఆడిందే ఆట పాడిందే పాటగా అన్నచందంగా మారింది.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని (బాలాజీ ఇంటిగ్రేటెడ్‌ టీచింగ్‌ స్కూల్‌) కార్పోరేట్‌ పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తోంది. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఒంటి పూట న‌డ‌పాలంటే.. విద్యాశాఖ రూల్స్ ప‌ట్టించుకోకుండా రెండు పూటలా పాఠశాల నిర్వహిస్తూ విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తుంది. అంతేకాకుండా ఓ వైపు వార్షిక పరీక్షలు నడుస్తుండగా శుక్రవారం ఒకటో తరగతి విద్యార్థి ఫీజు కట్టలేదని వార్షిక పరీక్ష రాయనివ్వలేదు. దీంతో ఆ విద్యార్థి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.

- Advertisement -

వాస్తవానికి విద్యా హక్కు చట్టం ప్రకారం ఆయా పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను మాత్రమే ఫీజుల విషయంలో ఇన్వాల్వ్‌ చేయాలే తప్పా విద్యార్థులను డబ్బుల కోసం వేధించకూడదు. ఇవన్నీ తెలిసినప్పటికి కార్పోరేట్‌ యాజమాన్యం డబ్బుల కోసం తోటి విద్యార్థుల ముందు ఫీజు కట్టని విద్యార్థులను హేళన చేయడం, పరీక్షలు రాయనీయక పోవడంతో పరిపాటిగా మారింది. దీంతో ఆ పసి హృదయాల మానసిక స్థైర్యం దెబ్బతినేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఒకటో తరగతి విద్యార్థిని పరీక్ష రాయనీయకుండా ఇబ్బందులకు గురి చేయడంతో శనివారం విద్యార్థి తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు పిర్యాధు చేశారు. దీంతో పాఠశాల తీరు మరోసారి తేటతెల్లమైంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న బిట్స్‌ పాఠశాల పై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

బిట్స్‌ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి: ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం

ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న బాలాజీ ఇంటిగ్రేటెడ్‌ టీచింగ్‌ స్కూల్‌ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత జాతీయ విద్యార్థి సంఘం(ఎన్‌ఎస్‌యూఐ) డిమాండ్‌ చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కర్ణాకర్‌,జిల్లా కార్యదర్శి మట్టెవాడ సురేష్‌ మాట్లాడుతూ బిట్స్‌ కార్పోరేట్‌ పాఠశాల నింబంధనలు పాటించడం లేదని గతంలో అనేక మార్లు జిల్లావిద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా వారి పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం ఓ విద్యార్థికి పరీక్ష పెట్టలేదని వారి తల్లిదండ్రులు మా దృష్టికి రాగా పాఠశాలను సందర్శించామన్నారు. అంతే కాకుండా పాఠశాల రెండు పూటలు నడుస్తుందని ఈవిషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. నిబంధనలు పాటించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న బిట్స్‌ పాఠశాల రిజిష్ట్రేషన్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

విద్యార్థులను ఫీజులు అడగవద్దు: బిట్స్‌ పాఠశాల యాజమాన్యానికి షోకాజు నోటీసు

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిట్స్‌ పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులను కాకుండా నేరుగా విద్యార్థులను ఫీజులు అడిగి మానసికంగా వేధిస్తున్నందున ఆ పాఠశాల యాజమాన్యానికి షోకాజు నోటీసు జారీ చేశామని భూపాలపల్లి ఎంఈఓ దేవా నాయక్‌ ప్రభ న్యూస్‌ కు తెలిపారు. అదేవిధంగా పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రెండు పూటల తరగతులు నిర్వహిస్తున్నారని తమకు ఫిర్యాదులు అందిన దృష్ట్యా శనివారం పాఠశాలను సందర్శించిన వాస్తవమేనని తేలడంతో యాజమాన్యానికి షోకాజు నోటీసు జారీ చేశామని ఎంఈఓ దేవా నాయక్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement