న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ (వారణాసి)లో గంగా పుష్కరాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గౌరవాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఆదివారం కాశీలోని శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో కే. నరసింహమూర్తి అధ్యక్షతన ‘కాశీ తెలుగు సమితి’ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం జరిగింది. రానున్న గంగా పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా గంగా పుష్కరాల నిర్వహణ కోసం కమిటీని ఏర్పాటు చేసి, దానికి గౌరవాధ్యక్షులుగా ఎంపీ జీవీఎల్ నరసింహారావును ఎన్నుకున్నారు.
పుష్కరాల సందర్భంగా నిర్వహించాల్సిన వివిధ సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలపై చర్చించారు. అలాగే కాశీ తెలుగు సమితి ఉపాధ్యక్షులుగా వి. సుబ్రహ్మణ్యం (మణి), కార్యదర్శిగా వీవీ సుందర శాస్త్రి, గంగా పుష్కరాల నిర్వహణ కమిటీ జాయింట్ సెక్రటరీగా టి. గజానన్ జోషిని నియమిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో సుందర శాస్త్రి, సుబ్రహ్మణ్యం (మణి), టి. గజానన్ జోషి, నిర్మల రామనాథ శర్మ, సైకిల్ బాబా, కె.వి.ఎ. సంతోష్ కుమార్ వంటి కాశీలోని తెలుగు ప్రముఖులు, సంస్థలు పాల్గొన్నాయి.