Saturday, November 23, 2024

Delhi | కులగణనతోనే అన్ని వర్గాలకు న్యాయం : రఘువీరా రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతదేశంలో కులరహిత సమాజం సాధ్యం కాదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు రఘువీరా రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి చెబుతూ.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించిందని, త్వరలో విపక్ష కూటమిలో చర్చించి భాగస్వామ్య పార్టీలను సైతం దేశవ్యాప్త కులగణనకు ఆమోదం తెలిపేలా ప్రయత్నిస్తుందని వెల్లడించారు.

ఈలోగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కులగణన చేపట్టాలని నిర్ణయించినట్టు రఘువీరా వెల్లడించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఆర్థికంగా, సామాజికంగా సమాన అవకాశాలు దక్కాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమని వివరించారు. పార్టీ ఆవిర్భవించిన తొలినాళ్ల నుంచి అణగారిన వర్గాలకు అగ్రతాంబూలం వేసిందని అన్నారు. 2011లో జరిగిన జనాభా లెక్కల సేకరణ సమయంలోనే నాటి యూపీఏ ప్రభుత్వం కులాలవారిగా సమాచారాన్ని సేకరించిందని, అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఆ వివరాలను వెల్లడించడం లేదని రఘువీరా రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

ఒకవేళ ఆ వివరాలు విడుదల చేసి ఉంటే మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉండేదని, అలాగే వెనుకబడిన వర్గాలు (బీసీ)కు కూడా తగిన స్థానం లభించేదని అన్నారు. మహిళా బిల్లు చట్టంగా మారింది తప్ప దాని వల్ల ఉపయోగం లేకుండా పోయిందని ఆయనన్నారు. కులగణన ప్రస్తావన తీసుకొచ్చేసరికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గందరగోళంలో పడిందని రఘువీరా రెడ్డి అన్నారు. భారతదేశంలో కులరహిత సమాజం సాధ్యం కాదని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా చూస్తుందని తెలిపారు.

కులరహిత సమాజం కోసం కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి ప్రజల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో అక్టోబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ముఖ్య అతిథిగా ఆహ్వానించామని, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయనిచ్చే సమయాన్ని బట్టి బహిరంగ సభ తేదీ కూడా మారవచ్చని తెలిపారు. సోమవారం రాత్రి గిడుగు రుద్రరాజుతో పాటు ఖర్గేను కలిసిన రఘువీరా ఈ విషయం గురించే ఆయనతో సుదీర్ఘంగా చర్చించినట్టు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement