న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఎమ్మెల్యే (బీఆర్ఎస్) దుర్గం చిన్నయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత గడ్డం వినోద్ డిమాండ్ చేశారు. దుర్గం చిన్నయ్యపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో న్యాయం పోరాటం చేస్తున్న శేజల్‌ను మంగళవారం ఆయన కలిసి మద్ధతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బెల్లంపల్లిలో ఇంత దారుణమైన ఘటన చోటచేసుకోవడం బాధాకరమని అన్నారు. జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపించి శేజల్‌కు న్యాయం అందించాలని అన్నారు. డైరీ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం బెల్లంపల్లి వచ్చిన శేజల్ దగ్గర డబ్బు తీసుకుని ప్రభుత్వ భూమిని కట్టబెట్టారని, రూ. 30 లక్షలు తీసుకుని ఏడాది గడచిపోయిందని వినోద్ అన్నారు. ఇదేంటని ప్రశ్నించినందుకు లైంగిక వేధింపులు సహా బెదిరింపులకు పాల్పడుతున్నారని వినోద్ ఆరోపించారు. కాంగ్రెస్ తరఫున తాము శేజల్‌కు అండగా ఉంటామని, ఆమె న్యాయపోరాటానికి మద్ధతుగా నిలుస్తామని ప్రకటించారు.