హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షకు ఓ అభ్యర్థి తన వెంట మొబైల్ ఫోన్‌ను తెచ్చుకున్నారు. వెంటనే గుర్తించిన సిబ్బంది అతనిపై మాల్‌ప్రాక్టీస్ కేసును నమోదు చేశారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని నారాయణ జూనియర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం సెషన్‌కు ఓ అభ్యర్థి మొబైల్ ఫోన్‌తో పరీక్షా కేంద్రానికి హాజరైనట్లు అధికారులు గుర్తించి పోలీసు కేసును నమోదు చేయించినట్లు తెలిపారు.
వివిధ విభాగాల్లోని 1540 ఏఈఈ పోస్టులకు మొత్తం 81,548 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 75,265 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పేపర్-1, పేపర్-2కు రెండు సెషన్లలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్ పేపర్-1కు 61,453(75.36శాతం) మంది, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షకు 61,279(75.14శాతం) మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఏడు జిల్లాల్లో 176 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు అధికారులు ప్రకటించారు.