Monday, November 18, 2024

అమెరికాలో మళ్లీ పేలిన తూటా, జాత్యహంకారంతోనే కాల్పులు.. 10 మంది మృతి

న్యూయార్క్ : అమెరికాలో మరోసారి జాత్యహంకారం విషం కక్కింది. న్యూయార్క్‌లోని బుఫలో ప్రాంతంలోని నిత్యావసర సరుకుల దుకాణంలో శ్వేతజాతి యువకుడు జరిపిన కాల్పుల్లో పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులంతా నల్లజాతీయులు.రక్షణ కవచాలు ధరించి, హెల్మెట్‌ పెట్టుకున్న సాయుధ యువకుడు శనివారం నాడు సూపర్‌ మార్కెట్‌ వద్దకు వచ్చీరావడంతోనే బయట ఉన్న నలుగురిపై కాల్పులు జరిపాడు. తీవ్రం గాయపడిన వారు కుప్పుకూలిపోయిన వెంటనే లోపలికి జొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఆ సమయంలో లోపలున్న సెక్యూరిటీ గార్డు నిందితుడిపై కాల్పులు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. యువకుడి కాల్పుల్లో అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

మాజీ పోలీస్‌ అధికారి అయిన ఆ వృద్ధుడు స్టోర్‌లో భద్రతా విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. పెద్దఎత్తున ఆయుధాలతో వచ్చిన ఆ యువకుడు కాల్పుల ఉదంతాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేసుకుని రావడం గమనార్హం. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని లొంగిపోవాలని హెచ్చరించారు. ఆ సమయంలో తుపాకీతో ఆత్మహత్యకు సిద్ధపడి.. తరువాత ఆయుధాలు విడిచిపెట్టి పోలీసులకు లొంగిపోయాడు. ఇది జాత్యహంకారంతో చేసిన దురాగతమని బుఫలో పోలీస్‌ కమిషనల్‌ జోసెఫ్‌ గ్రమగ్లియా పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు జోబిడెన్‌, ప్రథమ మహిళ జిల్‌ బిడెన్‌ ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement