Wednesday, November 20, 2024

సముద్రంలో వేటకు విరామం.. ఈనెల 14 నుంచి జూన్‌ 15 వరకు నిషేధం

అమరావతి, ఆంధ్రప్రభ : సముద్రంలో వేటను ఈనెల 14 నుంచి నిషేధించనున్నారు. జూన్‌ 15 వరకు ఈ నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని తీర ప్రాంతంలో వేట సాగించే మత్స్యకారులకు మత్స్య శాఖ అధికారులు తెలియజేశారు. సముద్రంలో మత్స్య సంపద పునరుత్పత్తి ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు అధికంగా ఉంటుంది. ఈ కాలంలో వేట సాగిస్తే మత్స్య సంపద హరించిపోతుందన్న ఉద్దేశంతో ఏటా కేంద్రం రెండు నెలల పాటు సముద్రంలో వేటను నిషేధించడం ఆనవాయితీగా వస్తోంది.

శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిగోదావరి, కృష్ణ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేట సాగించే మత్స్య కారులు ఉన్నారు. ఈ జిల్లాల్లో వేలాది మంది మత్స్యకార కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తారు. నిషేధం కారణంగా వీరంతా ఉపాధి కోల్పోతున్నారు. అయితే వీరికి ప్రభుత్వం నిషేధ భృతి కింద రూ.10 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది వేట నష్టాలతోనే సాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాయుగుండాలు, అల్పపీడనాలు, సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో వేట అశించిన స్ధాయిలో సాగలేదు. దీంతో చాలామంది మత్స్యకారులు రెండు నెలల ముందు నుంచి వేటకు విరామం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement