న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈసారి కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రతియేటా నవంబర్ మాసాంతంలో మొదలై డిసెంబర్లో ముగిసేలా సమావేశాల తేదీలను ఖరారు చేస్తుండగా, ఈసారి సమావేశాలు డిసెంబర్ 7న మొదలై 29న ముగియనున్నట్టు సమాచారం. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సైతం ఇవే తేదీలను సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఈసారి సమావేశాల్లో మొత్తం 17 పనిదినాలు ఉంటాయి. సమావేశాల మొదటి రోజు సిట్టింగ్ సభ్యుల మృతికి సంతాపం ప్రకటిస్తూ వాయిదా వేసే అవకాశం ఉంది.
ఈ మధ్యకాలంలో చనిపోయినవారిలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. గత రెండున్నరేళ్లుగా పార్లమెంట్ సమావేశాలను కోవిడ్-19 వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లతో నిర్వహించిన విషయం తెలిసిందే. సభ్యుల మధ్య దూరం ఉండేలా పబ్లిక్ గ్యాలరీలో సందర్శకులను నిలిపివేసి సభ్యులను కూర్చోబెట్టారు. అలాగే ఉభయ సభల్లో సభ్యులను సర్దుబాటు చేసి సమావేశాలు నిర్వహించారు. దాంతో ఏకకాలంలో రెండు సభలు నిర్వహించడం సాధ్యపడలేదు. అయితే కోవిడ్-19 వ్యాప్తి తగ్గిన తర్వాత ఒకే సభలో నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి దాదాపుగా నియంత్రణలో ఉండడం, సభ్యులతో పాటు సిబ్బంది అందరూ టీకాలు పొంది ఉండడం వంటి కారణాలతో ఈసారి సమావేశాలను పెద్దగా ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండానే నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే సందర్శకులు, మీడియా ప్రతినిధులను అనుమతిస్తారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.