ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల ప్రత్యేక నంబర్ల వేలం ద్వారా రూ.45,52,921 ఆదాయం సమకూరినట్లు హైదరాబాద్ జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు. లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు TS09 FT 0001 నంబర్‌ను రూ.7,01,000కు, రతన్ నల్లా TS 09 FT 0009 నంబర్‌ను రూ.3,75,999కు వేలంలో దక్కించుకున్నారని తెలిపారు. TS09 FS 9999 నంబర్‌ను ప్రముఖ టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వేలంలో రూ. 17 లక్షలకు దక్కించుకున్నారని వెల్లడించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మధ్య లంబోర్ఘిని ఊరుస్ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్న విషయం తెలిసిందే. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కారుని ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. అయితే మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు వేలం వేయగా, జూనియర్ ఎన్టీఆర్ TS 09 FS 9999 నంబర్ కోసం దాదాపు రూ. 17 లక్షలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.
ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఇదే హయ్యస్ట్ బిడ్ అని అధికారులు చెప్తున్నారు. ఎన్టీఆర్ గ్యారేజ్‌లో ఉన్న కార్లు అన్నింటికి 9999 నంబర్ ఉంటుంది. కొత్తగా ఏ కారు తీసుకున్నా కూడా దానికి కూడా అదే నెంబర్ వచ్చేలా జాగ్రత్తపడతాడు. తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు, తండ్రి హరికృష్ణ 9999 కారు నంబర్‌గా వాడారని, అందుకే తనకు ఆ నెంబర్ ఇష్టమని ఎన్టీఆర్ గతంలో చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ ట్విటర్ ఖాతా కూడా @tarak9999 అనే ఉంటుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేయనున్నాడు. మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదం అందిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ షోకి రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ వంటి సెలబ్స్ రాగా, త్వరలో మహేష్ బాబు, ప్రభాస్ రానున్నట్టు తెలుస్తుంది.
ఇది కూడా చదవండి: ఏపీ నీటి తరలింపును నిలువరించండి: KRMBకి తెలంగాణ లేఖ