Monday, November 18, 2024

Heat stroke | మండుతున్న ఎండలకు 98 మంది బలి..

తీవ్రమైన వడగాడ్పులతో ఉత్తర భారతం విలవిలలాడుతున్న తరుణంలో గడచిన మూడు రోజుల్లో తీవ్రమైన వేడిమికి ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల్లో 98 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో 54 మంది మరణించగా, బీహార్‌లో 44 మంది తీవ్రమైన వేడి వాతావరణానికి బలైపోయారు. ఉత్తరప్రదేశ్‌లో ని బల్లియాలోని జిల్లా ఆసుపత్రిలో వడదెబ్బ కారణంగా చేరిన వారిలో 54 మంది మరణించారు. గత మూడు రోజుల్లో జ్వరం, ఊపిరి ఆడకపోవడం, తదితర ఆరోగ్య సమస్యలతో కనీసం 400 మంది జిల్లా ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు.

రోగుల్లో అత్యధికులు 60 సంవత్సరాలు పైబడినవారని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జయంత్‌ కుమార్‌ తెలిపారు. రోగులకు, సిబ్బందికి వడదెబ్బ తగలకుండా ఆసుపత్రిలో ఫ్యాన్లు, కూలర్‌, ఏసీలు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ దివాకర్‌ సింగ్‌ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో మరణాల వెనుక కారణాలను తెలుసుకోవడానికి ఇద్దరు సభ్యులతో కూడిన బృందాన్ని ఉత్తరప్రదేశ్‌ డిప్యూటీ సీఎం బ్రిజేష్‌ పాథక్‌ బల్లియాకు పంపించారు. ఆసుపత్రి చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దివాకర్‌ సింగ్‌ను ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది.

భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకారం బల్లియాలో సాధారణ ఉష్ణగ్రత కంటే 4.7 డిగ్రీలు ఎక్కువగా 42.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. బీహార్‌ రాష్ట్రంలో వీస్తున్న తీవ్రమైన వడగాడ్పులకు 44మందికిపైగా ప్రజలు మరణించారు. ఎండలు ఠారెత్తిపోతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటికే పరిమితం కావాలని రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదే విషయమై పాట్నాలో వాతావరణ విభాగ అధికారి ఆశిష్‌ కుమార్‌ మాట్లాడుతూ ”19 రోజులుగా బీహార్‌ను అల్లాడిస్తున్న వడగాడ్పులు గత కొద్ది రోజులుగా మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది వడగాడ్పులు తీవ్రతకు సంబంధించి 2012 సంవత్సరపు రికార్డులను బద్దలు కొట్టాయి. ఇవి మరికొద్ది రోజులు కూడా కొనసాగుతాయని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

- Advertisement -

గడచిన 24 గంటల్లో పాట్నా తూర్పు ప్రాంతం గరిష్టంగా 45.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను నమోదు చేయగా, పాట్నా పశ్చిమ ప్రాంతం 45.1 డిగ్రీల సెల్సియస్‌ రికార్డు చేసింది. బీహార్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇతర ప్రముఖుల నివాసాలు ఉన్న పాట్నా క్యాపిిటల్‌ రీజియన్‌ అత్యధిక చెట్లతో పచ్చదనాన్ని సంతరించుకున్న కారణంగా పైన పేర్కొన్న ప్రాంతాలతో పోలిస్తే కాస్త తక్కువ అన్నట్టుగా 44.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను నమోదు చేసింది. పాట్నాతో పాటుగా షేఖ్‌పురా సైతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఆర్వాల్‌, జహనాబాద్‌, భోజ్‌పూర్‌, బక్సర్‌, షేఖ్‌పురా, రోహ్‌తస్‌, భదువా, కైమూర్‌, ఔరంగాబాద్‌, నలంద, నవడ జిల్లాలో తీవ్రమైన వడగాడ్పులు వీస్తున్నాయి.

పాట్నా, నవడ, నలంద, భోజ్‌పూర్‌, ఆర్వాల్‌ రాత్రి పూట సైతం ఉష్ణోగ్రత సాధారణం కన్నా అత్యధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. అయితే నైరుతి రుతుపవనాల రాకతో కిషన్‌గంజ్‌, అరారియా, పుర్నియా జిల్లాల ప్రజలకు వడగాడ్పుల నుంచి ఉపశమనం లభించిందని చెప్పారు. రాష్ట్రంలోని పాట్నా, తదితర జిల్లాల్లో జూన్‌ 24వరకు విద్యా సంస్థల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన వడగాడ్పుల దృష్ట్యా పాఠశాలలకు వేసవి సెలవులను జూన్‌ 30 వరకు పొడిగించాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. విదర్భ, చత్తీస్‌గఢ్‌లో అనేక చోట్ల వచ్చే ఐదు రోజుల వరకు తీవ్రమైన వడగాడ్పులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ తాజా బులెటిన్‌లో పేర్కొంది. తెలంగాణ, కోస్తా ఆంధ్రా, ఒడిశా, జార్ఖండ్‌, యానం, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement