Friday, November 22, 2024

టీఎస్‌ ఆర్టీసీలో 95 శాతం పోస్టులు స్థానికులకే.. ప్రభుత్వం ఆమోదించిన వెంటనే కొత్త రిక్రూట్‌మెంట్‌ ప్రారంభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ ఆర్టీసీలో ఇకపై 95 శాతం పోస్టులను స్థానికులకే కేటాయించనున్నారు. జోనల్‌, మల్టి జోనల్‌ పద్దతిలో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో 95 శాతం స్థానికత అంశాన్ని అన్ని శాఖలు పరిగణనలోనికి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. దీనికి సంబంధించిన బిల్లును గత శాసనసభ సమావేశాలలో ఆమోదించారు. దీంతో టీఎస్‌ ఆర్టీసీలోనూ సింహభాగం ఖాళీలను స్థానికులతోనే భర్తీ చేయాలని తాజాగా జరిగిన సమావేశంలో పాలక మండలి నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33 రెవెన్యూ జిల్లాలు ఉండగా, ఆర్టీసీలో 11 రీజియన్లు ఉన్నాయి. అలాంటప్పుడు స్థానికతను ఏ ప్రాతిపదికన పరిగణనలోనికి తీసుకోవాలనే అంశంపై పాలక మండలి సమావేశంలో సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. దీనికి సంబంధించి ఓ ప్రతిపాదనను తయారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదన ప్రభుత్వ ఆమోదం పొందిన తరువాత కొత్త విధానంలో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి డిపో మేనేజర్‌ కంటే దిగువ అధికార పోస్టులలో ఖాళీలు ఉండగా, త్వరలో డ్రైవర్‌ కండక్టర్‌ పోస్టులలో ఖాళీలు కూడా ఏర్పడనున్నాయి.

తార్నాకలోని ఆర్టీసీ ఆసుప్రతిలో ఐదుగురు వైద్యులను ఔట్‌ సోర్సింగ్‌ పద్దతి ద్వారా నియమించాలని పాలక మండలి సమావేశంలో తీర్మానించారు. ఆసుపత్రికి అనుబంధంగా ఏర్పాటైన నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌తో పాటు కొత్తగా అందిస్తున్న సూపర్‌ స్పెషాలిటీ సేవలకు సంబంధించి డయాలసిస్‌ టెక్నీషియన్లు, నర్సులను ఔట్‌ సోర్సింగ్‌ పద్దతి కింద నియమించుకునేందుకు ఆసుప్రతి పాలక మండలికి బోర్డు అనుమతించింది. ఇదిలా ఉండగా, గత పన్నెండేళ్లుగా ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్ల భర్తీ ప్ర్రక్రియను ప్రారంభించకపోవడంపై యూనియన్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వందలాదిగా ఉన్న కండక్టర్‌, డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేయని కారణంగా ప్రస్తుతం ఉన్న వారిపై అధిక భారం పడుతున్నదనీ, అదనపు డ్యూటీలు చేయాల్సి వస్తున్నదని పేర్కొంటున్నారు.

- Advertisement -

ఈ కారణంగానే ఇటీవల వరుస బస్సు ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు. టీఎస్‌ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న కండక్టర్‌, డ్రైవర్‌ పోస్టులతో పాటు ఖాళీగా ఉన్న డిపో మేనేజర్లు, టెక్నీషియన్లు, మెకానిక్‌ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు. ఆర్టీసీలో ఖాళీలను భర్తీ చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు యాజమాన్యం కూడా పలుమార్లు హామీ ఇచ్చిందనీ, ఇప్పటికైనా ఆ హామీని నిలబెట్టుకుని డ్రైవర్లు, కండక్టర్లపై అధిక పనిభారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement