సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సమగ్ర ఇంటింటి సర్వేలో మొత్తం 1,17,58,491 నివాసాలు గుర్తించగా, సోమవారం నాటికి 1,08,89,758 కుటుంబాల్లో సర్వే పూర్తి చేసి 92.6 శాతానికి చేరుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
కాగా, రాష్రంలో 13 జిల్లాల్లో 100 శాతం సర్వే పూర్తయింది. సంగారెడ్డి 88.1శాతం, మెడ్చల్ మల్కజిగిరి 82.3శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు దృవీకరించారు. మిగతా 17 జిల్లాల్లో 90 శాతానికి పైగా ఇంటింటి సర్వే పూర్తయింది.
మొన్నటివరకూ వెనకబడి ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా సర్వే జోరందుకుంది. జిహెచ్‌ఎంసీ పరిధిలో 25,05,517 నివాసాలు సర్వే చేయాల్సి ఉండగా సోమవారం నాటికి 19,04,977 కుటుంబాల్లో సర్వే పూర్తిచేసి 76 శాతానికి చేరుకున్నారు.
సర్వే పూర్తయిన జిల్లాల్లో డాటా నమోదు ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 12,85,871 నివాసలకు సంబంధించి కంప్యూటరీకరణ పూర్తయింది. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్ని జిల్లా ఇన్‌చార్జ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సర్వే పత్రాలను భద్రంగా ఉంచాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.