Friday, November 22, 2024

ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి 91వ ర్యాంక్‌.. వర్సిటీకి 101-150 విభాగంలో స్థానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ఇంజనీరింగ్‌ విభాగంలో ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి దేశ వ్యాప్తంగా 91వ స్థానం, యూనివర్సిటీల స్థానంలో 101 నుంచి 150వ విభాగంలో స్థానం లభించింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ వరదారెడ్డి మాట్లాడుతూ కేవలం ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ మాత్రమే దేశంలోని ఇంజనీరింగ్‌ కాలేజీలల్లో 100 లోపు ర్యాంకును సాధించిందన్నారు. ఎస్‌ఆర్‌ కాలేజీలో ఉన్న అన్ని డిగ్రీ కోర్సులు ఎన్‌బీఏ టైర్‌-1 కింద గుర్తించబడినాయని ఆయన వెల్లడించారు. ఎస్‌ఆర్‌ వర్సిటీ వీసీ జిఆర్‌సి రెడ్డి మాట్లాడుతూ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో ఎస్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ 91వ స్థానం సాధించడం రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకే గర్వకారణమన్నారు. యూనివర్సిటీలో గల బోధనా విధానం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిత్య పరిశోధనలపై వర్సిటీకి గల నిబద్ధతకు కొలమానమన్నారు. వర్సిటీలో పరిశోధనకుగానూ అనేక విభాగాలను నెలకొల్పినట్లు తెలిపారు. వర్సిటీ సాధించిన ర్యాంకింగ్‌కు కారకులైన కళాశాల అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని, విద్యార్థులను అభినందించారు. ఈ సమావేశంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ సివి.గురురావు, డీన్‌ డాక్టర్‌ ఆర్‌.అర్చనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement