Tuesday, November 26, 2024

Followup : ఈ సెట్‌లో 90.69శాతం మంది ఉత్తీర్ణత.. ఫలితాలను ప్రకటించిన మంత్రి సబిత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈసెట్‌ ప్రవేశ పరీక్షలో 90.69శాతం ఉత్తీర్ణత సాధించారు. జేఎన్‌టీయూ నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. ఈసెట్‌కు 22, 001 మంది విద్యార్థులు హాజరుకాగా ఇందులో 15, 578 మంది అబ్బాయిలు, 6423 మంది అమ్మాయిలు ఉన్నారు. అబ్బాయిల్లో 14,107 మంది (90.55) అర్హత సాధించగా, అమ్మాయిల్లో 5847 మంది (91.03) శాతం అర్హత సాధించారు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ , ట్రిపుల్‌ ఈ, ఈఐఈ, సివిల్‌, కెమికల్‌, మెకానికల్‌, మైనింగ్‌, మెటలర్జీ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు పరీక్ష కన్వీనర్‌, జేఎన్‌టీయూ సీనియర్‌ ప్రొఫెసర్‌ ఆచార్య విజయ కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,300 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పాలిటెక్నిక్‌ కోర్సును పూర్తి చేసి నేరుగా రెండో సంవత్సరం ఇంజనీరింగ్‌ కోర్సులో చేరేందుకు ఉన్నత విద్యామండలి ప్రతీ ఏటా ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ ఖైరతాబాద్‌కు చెందిన కేశరాజు హారిక మొదటి ర్యాంకును, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌కు చెందిన పిడుగు పావని రెండో ర్యాంకును, సంగారెడ్డికి చెందిన మన్నె సాయి గౌతం కుమార్‌ రాష్ట్ర వ్యాప్తంగా మూడో ర్యాంకును, నల్గొండ జిల్లా నాంపల్లి మండలానికి మహేశ్వరం జగదీష్‌ నాలుగో ర్యాంకును , హైదరాబాద్‌ సికింద్రాబాద్‌ ప్రాంతానికి చెందిన అబ్బోజు శంతన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో అయిదో ర్యాంకును సాధించారు.

ఈసీఈ విభాగంలో మొదటి ర్యాంకును వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన సాయి మానసి సాధించింది. రెండో ర్యాంకును సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన శివ తేజస్విని, మూడో ర్యాంకును వరంగల్‌ జిల్లా పర్వతనగర్‌కు చెందిన మట్టపల్లి హీరవర్ధన్‌, నాలుగో ర్యాంకును ఏపీకి చెందిన నెల్లెపల్లి భువనేశ్వరి, అయిదో ర్యాంకును వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆకునూరుకు చెందిన కాళె మేఘన సొంతం చేసుకుంది. ట్రిపుల్‌ ఈ విభాగంలో మొదటి ర్యాంకును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనగర్‌ కాలనీకి చెందిన గుగ్గిళ్ల ప్రణయ్‌, రెండో ర్యాంకును తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మల్లిడి సాయి సహిత్‌రెడ్డి, మూడో ర్యాంకును నల్గొండ శివాజీ నగర్‌కు చెందిన రుద్రారం సాయికుమార్‌, నాలుగో ర్యాంకును హన్మకొండకు చెందిన జాస్మిన్‌, అయిదో ర్యాంకును మంచిర్యాలకు చెందిన అజయ్‌ సాధించారు. సివిల్‌ ఇంజనీరింగ్‌లో తొలి ర్యాంకును విజయనగరం జిల్లా బాలాజీ పేటకు చెందిన హేమంత్‌ , రెండో ర్యాంకును జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన హరితారెడ్డి, మూడో ర్యాంకును వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలకు చెందిన అఖిల్‌, నాలుగో ర్యాంకును భూపాలపల్లికి చెందిన సౌమ్య, అయిదో ర్యాంకును వరంగల్‌కు చెందిన పవన్‌ సాధించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement