Friday, November 22, 2024

ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నమెంటు రేసులో 9 మంది.. టీమిండియా నుంచి కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌

ఈ ఏడాది ప్రపంచకప్‌ విజేత ఎవరో రేపు (ఆదివారం) తెలియనుంది. నవంబర్‌ 13న మెల్‌ బోర్న్‌ స్టేడియంలో జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. దాంతో ఈ ఏడాది ప్లేయర్‌ ఆఫ్‌ ది టీ 20 వరల్డ్‌ కప్‌ 2022 అవార్డుని ఎవరు అందుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ అవార్డు కోసం టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన 9 మంది ఆటగాళ్ల పేర్లతో కూడిన జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో తమకు నచ్చిన ఆటగాడికి ఓటు వేసే అవకాశాన్ని అభిమానులకు కల్పించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది.

భారత జట్టు నుంచి విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, పాకిస్థాన్‌ టీమ్‌ నుంచి షాదాబ్‌ ఖాన్‌, షాహీన్‌ అఫ్రిది చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌ జట్టు నుంచి అత్యధికంగా ముగ్గురు ప్లేయర్‌ ఆఫ్ ది టీ 2022 అవార్డు రేసులో ఉన్నారు. జోస్‌ బట్లర్‌, సామ్‌ కర్రన్‌, అలెక్స్‌ హేల్స్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. జింబాబ్వే బ్యాటర్‌ సికిందర్‌ రజా, శ్రీలంక స్పిన్నర్‌ వనిందు హసరంగ పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మొదటి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై పాకిస్థాన్‌ జట్టు విజయం సాధించింది. రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్‌ జట్టు టీమిండియాను ఓడించింది. ఈ సారి ఫైనల్లో ఏ జట్టు గెలిచినా టీ 20 వరల్డ్‌ కప్‌ను రెండోసారి జట్టు సాధించిన జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. పాకిస్థాన్‌ 2009లో, ఇంగ్లాండ్‌ 2010లో పొట్టి ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచాయి. పొట్టి ప్రపంచకప్‌ని రెండు సార్లు (2012, 2016) గెలిచిన మొదటి జట్టు రికార్డు వెస్టిండీస్‌ పేరున ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement