హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైళ్లలో అనధికారిక ప్రయాణాన్ని అరికట్టడానికి, అధికారిక టకెట్‌తో ప్రయాణించే రైలు ప్రయాణికులకు అసౌకర్యాన్ని తగ్గించే దిశగా ద.మ.రైల్వే నిరంతరం విస్తృతంగా టికెట్ తనిఖీ డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టికెట్ తనిఖీ సిబ్బంది నిర్విరామ కృషి ఫలితంగా జోన్లలో టికెట్ల అమ్మకాల పెంపు మెరుగుపరచడం జరిగింది. ఇందులో భాగంగా టికెట్ లేకుండా ప్రయాణించడం, పరిమితికి మించి లగేజ్‌ని బుక్ చేయకుండా వెళుతున్న ప్రయాణికుల నుంచి ద.మ.రైల్వేకు చెందిన 9 మంది టికెట్ తనిఖీ సిబ్బంది రికార్డు స్థాయిలో ఒక్కొక్క టికెట్ తనిఖీ అధికారి రూ.కోటికి పైగా వసూలు చేయడం ద్వారా రికార్డు సృష్టించారు.
వివిధ రైళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 1.16 లక్షల అధికారికి ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.9.62 కోట్లు వసూలు చేయడం జరిగింది. దీంతో పాటు వన్ క్రోర్ క్లబ్‌లో స్థానం సంపాదించారు. ఈ విధులు నిర్వహించిన టికెట్ తనిఖీ సిబ్బందిలో సికింద్రాబాద్ డివిజన్ నుంచి ఏడుగురు, గుంతకల్, విజయవాడ డివిజన్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ సందర్భంగా ద.మ.రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో అంకితభావంతో పనితీరు కనబరచిన టికెట్ తనిఖీ సిబ్బందిని ప్రశంసించారు.
టికెట్ తనిఖీ అనేది నిర్దిష్టమైన విధానమనీ, ఇది అధికారిక రైలు ప్రయాణికులలో విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు టికెట్ రహిత ప్రయాణికులను అరికట్టేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రైలు ప్రయాణికులంతా చెల్లుబాటయ్యే రైల్వే టికెట్, సరైన ప్రయాణ ధృవీకరణ పత్రాలతో ప్రయాణించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.