హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఈ ఏడాది చేపట్టిన ఎనిమిదో విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం లక్ష్యం వైపు వేగంగా సాగుతోంది. ఇప్పటికే నిర్దేశిత లక్ష్యానికి మించి ఆరు జిల్ల్లాలో మొక్కలను నాటారు. ఎనిమిదో విడత హరితహారంలో భాగంగా మొత్తం 19.54 కోట్ల మొక్కలను నాటాలని అటవీశాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే 17.77 కోట్ల పైబడి మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు. వనపర్తి, మంచిర్యాల, గ్రేటర్ హైదరాబాద్, సంగారెడ్డి, ములుగు, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాల్లో లక్ష్యం దాటింది.
వనపర్తి జిల్లాలో 13.6 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతుకుమించి 25.04 లక్షల మొక్కలను నాటడంతో మొదటి స్థానంలో నిలిచింది. మంచిర్యాల జిల్లాలో 40.280 లక్షల మొక్కల లక్ష్యానికిగాను 47.017 లక్షలు, గ్రేటర్ హైదరాబాద్‌లో 50 లక్షలకుగాను 55.114 లక్షలు, సంగారెడ్డిలో 55.4 లక్షలకుగాను 58.983 లక్షలు, ములుగులో 14.970 లక్షలకు గాను 15.598 లక్షలు, కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో 52,689 లక్షలకుగాను 52.991 లక్షల మొక్కలు నాటి ముందు వరుసలో నిలిచాయి.
అలాగే మరో నాలుగు జిల్లాల్లో 90 శాతం, ఆరు జిల్లాలోల 80 శాతం, నాలుగు జిల్లాల్లో 70 శాతం, ఆరు జిల్లాల్లో 60 శాతం, ఐదు జిల్లాల్లో 50 శాతానికి పైగా మొక్కలను నాటారు. నల్గొండ జిల్లా మాత్రం కేవలం 20.03 లక్షల మొక్కలను నాటి చివరి స్థానంలో ఉంది. మొత్తం 8వ విడతలో ఇప్పటి వరకు 17.774 కోట్ల మొక్కలు నాటగా, వీటిలో 13,981కోట్ల మొక్కలు, 3,793 కోట్ల విత్తన బంతులు ఉన్నాయి.