హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఈసారి జూన్ మూడవ వారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 18వ తేదీ నుంచి 8వ విడత హరితహరం ప్రారంభం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది జూన్ రెండవ వారం నుంచి వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పచ్చదనం పెంపుకు అధికారులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. కాలువ గట్లు, అటవీ విస్తీర్ణం పది శాతం కంటే తక్కువగా ఉన్న జిల్లాల్లో భారీగా మొక్కలను నాటేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. ఈసారి జరగనున్న 8వ విడత హరితహారంలో మొత్తం 19.50 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటికే అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీల నర్సరీలలో మొక్కలను సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో రోజుకు ఉపాధి హామీ పథకం కింద వంద మందికి మొక్కలు నాటే పని కల్పించను న్నారు. ప్రధానంగా మొక్కలు పెంపు, నర్సరీల బాధ్యత అటవీ శాఖ, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక శాఖ, జిహెచ్ఎంసీ, హెచ్ఎం డిఏ చేపట్టాయి. వీటి ఆధ్వర్యంలో 14,955 నర్సరీలను అభివృద్ధి చేసి మొత్తం 32.90 కోట్ల మొక్కలను అందుబాటులో ఉంచారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన 12,769 నర్సరీలలో ఈ ఏడాది 20.18 కోట్ల మొక్కలు సిద్ధం చేశారు. అటవీ శాఖ అధ్వర్యంలో 550 నర్సరీలలో 6.27 కోట్లు మొక్కలు, పురపాలక శాఖ ఆధ్వర్యంలో 1002 నర్సరీలలో 2.03 కోట్లు మొక్కలు, జిహెచ్ఎంసి పరిధిలో 600 నర్సరీలలో 1.25 కోట్లు, హెచ్ఎండిఏ పరిధిలో 44 నర్సరీలలో 4.26 కోట్ల మొక్కలను నాటేందుకు సిద్ధం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..